BRS Vs Congress For Urea: యూరియా కొరతతో BRS దూకుడు: కాంగ్రెస్ కు చెక్ పెట్టేనా? KCR వ్యూహంతో ప్రకంపనలు ఖాయమా!
BRS Vs Congress For Urea: బీఆర్‌ఎస్ పుంజుకోవడానికి యూరియా కొరత అస్త్రంగా మారుతుందా? కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉంటుంది? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సభలో గులాబీ నేతల ప్లాన్ ఇదేనా?

BRS Vs Congress For Urea: రాజకీయాల్లో టైమింగా చాలా ముఖ్యం. దాన్ని గమనించి ఎత్తులు వేసిన వాళ్లే విజేతలు అవుతుంటారు. రాంగ్ టైమింగ్ చేసిన మంచి పని కూడా పార్టీలను, నేతలను నిలువునా ముంచేస్తోంది. అందుకే పార్టీలు, నేతలు తమ టైం కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అలాంటి టైంలో బీఆర్‌ఎస్‌కు వచ్చినట్టే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా యూరియా కొరత కనిపిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమస్య అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతుంటే బీఆర్‌ఎస్‌కు మాత్రం బూస్టుగా మారుతోంది.
ప్రజా ఉద్యమాలు చేయనిదే ఏ పార్టీ అయినా నేత అయినా ప్రజల మనన్నలు పొందలేడు. నిత్యం ఏదో సమస్యపై పోరాడుతూ ప్రజల్లో ఉంటేనే వాళ్లకు గుర్తింపు ఉంటుంది. 202౩లో అనూహ్యంగా ఓటమి చవి చూసిన బీఆర్‌ఎస్ ఒక్కసారిగా డీలాపడిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అయితే బయటకు రావడమే మానేశారు. అప్పుడప్పుడు బహిరంగ సభలు పెట్టారే తప్ప మరో చోట కనిపించడం లేదు. దీంతో పార్టీ కేడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు ప్రజల్లో ఉంటున్నా అనుకున్నంత మైలేజీ రావడం లేదు.
గతంలో వారి చేసిన తప్పులు వారిని వెంటాడుతూ వచ్చాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలపై వారు ఎన్ని విమర్శలు చేసినా... మీరేం చేశారూ అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే కొన్ని ప్రజాసమస్యలపై పోరాడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మద్దతుదారుల హైప్ తప్ప గ్రౌండ్‌లో మాత్రం అనుకున్నంత పాజిటివిటీ రావడం లేదని బీఆర్‌ఎస్ నేతల టాక్. కీలకమైన అంశాలు వారు ఎత్తుకున్నప్పటికీ ప్రజా స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది.
ఇంతలో కవిత తిరుగుబాటుతో కారు ప్రయాణం సాఫీగా సాగడం లేదనే టాక్ ఉంది. ఇంతలో కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూశారు. మరికొందరు ఏకంగా కండువాలు మార్చేసుకున్నారు. మాజీలు రాజీనామాలు చేశారు. పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ ఇకపై ప్రధాన పోటీ కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందనే చర్చ మొదలైంది. ఇంతలో ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, గొర్రెల స్కామ్ ఇలా చాలా ఆ పార్టీ నేతలను చుట్టుముట్టాయి.
ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో తీవ్రంగా ఉన్న యూరియా కొరత వరంలా మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజాఉద్యమాలను రక్తికట్టించడంలో సిద్ధహస్తులైన నేతలకు ఇది అస్త్రంగా మారుతుందని అంటున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో యూరియా కొరతపై నేతల పోరాటం మొదలైంది. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో దాన్ని మరింత వేడెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ కాస్త బీఆర్‌ఎస్ అయిన తర్వాత నాటి వాడి వేడీ లేదనే విమర్శ చాలా మందిలో ఉంది. కానీ అలాంటిదేమీ లేదని శనివారం జరిగిన హైడ్రామా ఉదాహరణగా నిలిచింది. యూరియా కొరతను ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని భావించిన బీఆర్‌ఎస్ మొదటి రోజు ఆ సెగను చూపించింది. యూరియా కొరత తీర్చాలని అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీ తీశారు. ప్లకార్డులతో అసెంబ్లీక వెళ్లారు. ఈ మధ్య కాలంలో చనిపోయిన మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన తర్వాత సభను వాయిదా వేశారు.
సభ వాయిదా పడిన తర్వాత నుంచి బీఆర్‌ఎస్ విశ్వరూపం చూపించింది. ఎరువుల కొరత ఎప్పుడు తీరుస్తారని వ్యవసాయ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వంతో మాట్లాడి సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని బైఠాయించారు. అక్కడకు పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేయడంలో కాసేపు హైడ్రామా నడిచింది.
అక్కడ అరెస్టై వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో దిగిపోయి నాటకీయ పరిణామాల మధ్య సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. సీఎస్‌ను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసే వరకు వెనక్కి తగ్గబోమని నినాదాలు చేశారు. చివరకు అక్కడ కూడా పోలీసులు వచ్చి నేతలను అరెస్టు చేశారు. ఉదయం 9.30 నుంచి మొదలైన ఎరువుల ధర్నా ఎపిసోడ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది.

ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు టైమింగ్ సెట్ అయ్యింది. ఇప్పుడు ఎరువులు కొరత ఉన్నది వాస్తవం. కారణం ఏదైనా కావచ్చు పదేళ్లలో క్యూలైన్‌లు లేకుండా సరఫరా సాగిందన్నది వాస్తవం. ఆ పరిస్థితి లేదన్నది కళ్ల కనిపిస్తున్న నిజం. అందుకే దీనిపై బీఆర్‌ఎస్ పోరాటం ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు చాలా బలంగానే ఉన్నాయి. దీన్ని గ్రహించిన గులాబీ నేతలు ప్రత్యేక వ్యూహంతో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతపై పోరాటం చేయాలని నిర్ణయించారు.
యూరియా కొరతపై సభలో చర్చించాలని బీఆర్‌ఎస్ గట్టిగా పట్టుబడుతోంది. ఇదే విషయంపై సభను స్తంభింపజేయనుంది. కార్యాకలాపాలను అడ్డుకోనుంది. అవసరం అయితే సభలో వేటు వేయించుకొని ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. దీంతో బలనిరూపణ చేసుకొని ప్రజల్లో మరోసారి సత్తా చాటుకోవాలని స్కెచ్ వేసింది.
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వరం అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి కూడా తీర్మానం చేయాలని భావించింది. ఈ రెండు అస్త్రాలతో బీఆర్‌ఎస్, బీజేపీని ఇరుకున పెట్టాలని అనుకుంది. కానీ అంతకంటే బలమైన యూరియా అస్త్రంతో బీఆర్‌ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఈ అస్త్రం ఎలా పని చేస్తుందో తెలుస్తుంది.





















