BRS Litmus Test: బీఆర్ఎస్ తెలంగాణ ఫస్ట్ నినాదానికి లిట్మస్ టెస్ట్ - సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోతే రాజకీయంగా గండమే !
BRS: భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఫస్ట్ నినాదానికి పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోతే మరింత ఇబ్బందిపడే అవకాశాలు ఉన్నాయి.

Bharat Rashtra Samiti Telangana First slogan faces a big test: ఉప రాష్ట్రపతి ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి కొత్త సమస్య తెచ్చి పెట్టాయి. ఉన్నది నాలుగే ఓట్లు అయినా ఆ ఓట్లను ఎవరికి వేయాలన్నది పెద్ద సమస్యగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి కారణం ఇండి కూటమి తరపున అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ప్రకటించడమే. సుదర్శన్ రెడ్డి అచ్చమైన తెలంగాణ న్యాయకోవిదుడు. ఆయనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కాంగ్రెస్ సభ్యుడు కాదు. దేశలో అత్యున్నత పదవుల్లో ఒకటి అయిన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. మరి తెలంగాణ ఇంటి పార్టీ మద్దతు తెలియచేయదా ?
బీఆర్ఎస్ తెలంగాణ ఫస్ట్ నినాదానికి అగ్నిపరీక్ష
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్నారు.కానీ అసలుకే మోసం వచ్చింది. మళ్లీ బలం పుంజుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆదరించాలి. అలా చేయాలంటే.. తెలంగాణ వాదం మళ్లీ గట్టిగా వినిపించాలి. అందుకే కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలను.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది తమ పార్టీనేనని ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి అని పూర్తి పేరు కూడా ఇప్పుడు పలకడం లేదు. బీఆర్ఎస్ అంటున్నారు. మరి ఇలాంటి భావజాలంతో.. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా తమిళనాడు అభ్యర్థికి మద్దతిస్తే ప్రజలు .. బీఆర్ఎస్ చెప్పే తెలంగాణ ఫస్ట్ వాదాన్ని నమ్ముతారా ?
కాంగ్రెస్ అభ్యర్థి కాదు న్యాయకోవీదుడు !
సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకూ రాజకీయాల్లో లేరు. ఆయన రాజ్యాంగ నిపుణుడు అన్న కారణంగానే ఇండీ కూటమి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే మద్దతివ్వరా..అన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కోసం ఆయనకు కాంగ్రెస్ తో సంబంధం లేదు కాబట్టి మద్దతిస్తున్నామని ప్రకటింవచ్చు. కానీ కేటీఆర్.. ఇంతకు ముందు ఓ ప్రకటన చేశారు. యూరియా ఎవరు ఇస్తే వారికి మద్దతిస్తామన్నారు. యూరియా వస్తే గిస్తే కేంద్రం నుంచి రావాలి .. అంటే బీజేపీ నుంచి రావాలి. వచ్చే వారం పది రోజుల్లో తెలంగాణకు యాభై వేల టన్నుల యూరియా కేంద్రం పంపుతోంది. ఈ కారణంతో బీజేపీకి మద్దతిస్తారన్న చర్చ జరుగుతోంది.
సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోతే పార్టీ సెంటిమెంట్ పునాదులు మరింత బలహీనం
సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వకపోవడానికి బీఆర్ఎస్ ఏ కారణాలు చెప్పినా.. అది బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయ పునాదుల్ని మరింత బలహీనం చేస్తుంది. తెలంగాణ బిడ్డ.. డిల్లీ స్థాయి పదవికి పోటీ చేస్తూంటే.. కనీసం మద్దతివ్వరా అన్న ప్రశఅన వస్తుంది. ఇప్పటికే బీజేపీని విమర్సించేందుకు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. బీజేపీలో విలీనం గురించి చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక లిట్మస్ టెస్టుగా మారింది. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటేసినా..ఎన్నికలను బహిష్కరించినా.. బీఆర్ఎస్ పలుకుబడి ప్రజల్లో మరింత తగ్గిపోతుంది.





















