Telangana High Court: కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టులో హోరాహోరీ వాదనలు - కేసీఆర్‌కు ఊరట లభిస్తుందా?
Kaleshwaram report: కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.

TG High Court Kaleshwaram report: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కమిషన్ ఏర్పాటు , దాని నివేదిక రూపొందింపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని కేసీఆర్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని, నివేదికలో తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చట్టపరంగా, సాంకేతిక , ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జరిగిందని తెలిపారు. కానీ కమిషన్ ఈ అంశాలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ఉద్దేశంతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వాదించారు. నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా రూపొందించారని.. నివేదికలో తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేయడం, తమకు సరైన నోటీసులు ఇవ్వకపోవడం , సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని కేసీఆర్ తరపు లాయర్ వాదించారు
అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా 60 పేజీల సమగ్ర నివేదిక రూపొందించినట్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో నివేదిక వివరాలను ప్రకటించారని, ఈ నివేదికను త్వరలో అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. పిటిషనర్లు అియన కేసీఆర్, హరీశ్ రావు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నందున, చర్చలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ సమస్యలు ఉన్నాయని నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక స్పష్టం చేసిందని అందుకే కమిషన్ ఏర్పాటైందని ప్రభుత్వం తెలిపింది. కమిషన్ 16 నెలల పాటు విచారణ జరిపి, 116 మందిని ప్రశ్నించి, జులై 31, 2025న 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిని తెలిపారు.
విచారణలో ఈ నివేదికపై చర్యలు తీసుకుంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని అడిగి చెబుతానని లాయర్ చెప్పారు. శుక్రవారం లేదా సోమవారం చెబుతానని చెప్పడంతో.. రేపటికి కల్లా చెప్పాలని తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
కాళేశ్వరం రిపోర్టులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ పై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసులు ఉన్నాయి. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఈ నివేదికను ప్రతి ఎమ్మెల్యేకు ఇస్తామని.. అసెంబ్లీతో పాటు మండలిలోనూ కూలంకుషంగా చర్చిద్దామని రేవంత్ ప్రకటించారు. ఈ చర్చకు కేసీఆర్ కూడా రావాలన్నారు. చర్చించిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలన్న సభే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇదే వాదనను హైకోర్టుకు .. అడ్వకేట్ జనరల్ తెలిపే అవకాశం ఉంది.





















