BRS Protest For Urea : బీఆర్‌ఎస్ యూరియా ఆందోళనలో హైడ్రామా! సచివాలయం ముట్టడికి వెళ్లిన నేతల అరెస్టు
BRS Protest For Urea : తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ పోరు ఉద్ధృతం చేసింది. అసెంబ్లీ సమావేశాల టైంలో సచివాలయ ముట్టడికి యత్నించింది.

BRS Protest For Urea : తెలంగాణలో యూరియా రాజకీయం మరింత రాజుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన రోజునే అధికార ప్రతిపక్షాల మధ్య వాతావరణం హీటెక్కింది. తొలిరోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత నేతలంతా వ్యవసాయ కమిషనర్ వద్దకు వెళ్లారు. అక్కడ కమిషనర్‌తో మాట్లాడారు. యూరియా కొరతతీర్చాలని వినతి పత్రం ఇచ్చారు. ఎప్పటి లోపు యూరియా కొరత తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు.

అప్పటి వరకు కమిషన్ కార్యాలయంలోనే ఉంటామి స్పష్టం చేశారు. కమిషనర్‌కు కాసేపు సమయం ఇచ్చారు. అయినా వారి నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కార్యాలయం ఎదుటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలంతా బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. గణపతి బప్పా మోరియా... రైతులకు కావాలి యూరియా అంటూ నినదించారు.
పోలీసులు రంగప్రవేశం చేసి హరీష్‌రావు, కేటీఆర్ సహా ఇతర నేతలతో చర్చించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పోలీసుల మాటలను గులాబీ నేతలు లెక్క చేయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదుల చేయడం ఆపలేదు. దీంతో వారిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించారు.

వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ నేతలను బలవంతంగా తరలించేందుకు పోలీసుల చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. అయినా సరే అతికష్టమ్మీద వారిని వాహనాల్లోకి ఎక్కించి తరలించారు.

వ్యవసాయ కమిషన్ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ నేతలను తరలిస్తున్న టైంలో సచివాలయం వద్దకు వచ్చేసరికి వారి వాహనం ఆగిపోయింది. వెంటనే హరీష్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు వాహనాలు దిగిపోయారు. పక్కనే ఉన్న సచివాలయ ముట్టడికి వెళ్లారు. ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు యత్నించారు.

సచివాలయం భద్రతా సిబ్బంది వారిని లోపలికి పంపించేందుకు నిరాకరించారు. మళ్లీ అక్కడకు వచ్చిన పోలీసులు వారిని తరలించేందుకు యత్నించారు. అక్కడ కూడా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికి అక్కడ కూడా అతి కష్టమ్మీద నేతలను మరోసారి అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఇలా హైడ్రామా మధ్య బీఆర్‌ఎస్ నేతల యూరియా ధర్నా సాగింది.

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని ఆరోపిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీర్. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలాంటి సమస్య వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా, రైతుల సమస్యలు తప్ప అన్నింటిపై చర్చిస్తోందని ఆరోపించారు. అందుకే ఈ కాంగ్రెస్ పాలన వద్దురా అని ప్రజలు అంటున్నారని అభిప్రాయపడుతున్నారు.

BRS నేతల యూరియా ఆందోళన కార్యక్రమం కపట నాటకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా కారణమేదో తెలియదా అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా ? అని అనుమానం వ్యక్తం చేశారు. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం చేస్తున్నారని మండిపడ్డారు. జియో పాలిటిక్స్ వల్ల ,దేశీయ ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.

యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మర్చిపోతే ఎలా అని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్ పై శాపనార్ధాలు ఏంటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణ కు యూరియా పంపిణీ చేస్తున్నారన్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరని అభిప్రాయపడ్డారు.





















