Botsa Political Legacy: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
Botsa Family Politics: ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో మరో తరం రాజకీయానికి సిద్ధమైంది. ఆయన వారసురాలిగా బొత్స కుమార్తె అనూష రాజకీయ ప్రవేశం చేయనున్నారు.

Botsa Political Legacy: సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసత్వాన్ని రంగంలోకి దించుతున్నారు. బొత్స కుమారుడు ఆయన వారసుడిగా వస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన కుమార్తె తెరపైకి వచ్చారు. ఇప్పటికే ఆమె తండ్రి వెంట రాజకీయ సమావేశాలకు హాజరవుతున్నారు.
బొత్స సత్యనారాయణ.. ఉమ్మడి ఏపీలో కానీ… ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో కానీ సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు. ఐదుసార్లు మంత్రిగా పనిచేసిన ఆయన, బొబ్బిలి ఎంపీగా.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసిన బొత్స.. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. విజయనగరం జిల్లాను శాసించిన ఆయన మొన్నటి ఎన్నికల్లో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బొత్స కుటుంబం ప్రభావితం చేయగలుగుతంది. ఆయన భార్య ఝాన్సీ రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. సోదరుడు అప్పలనర్సయ్య ఎమ్మెల్యేగా.. తన మేనల్లుడు చిన్న శ్రీను ముఖ్య రాజకీయ నేతగా ఉన్నారు.
వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ముఖ్యమంత్రిగా ఈయన పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. వైఎస్ హయాం నుంచీ తిరుగులేని నేతగా ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో కాస్త నెమ్మదించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకపోవడం.. మండలి వైపు వెళ్లిపోవడంతో రాజకీయాల్లో తన కుటుంబాన్ని మరింత యాక్టివ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన అనూహ్యంగా తన కుమార్తెను తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కుమార్తె అనూష ఇద్దరూ వైద్యలే. కొంత కాలం తండ్రితో కలిసి రాజకీయాల్లో ఉన్నప్పటికీ సందీప్ అంత చుర్గాగా పాల్గొనలేదు. వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న ఆయనకు రాజకీయాలపై అంత ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఎంబీబీఎస్ చదివిన అనూష ఈమధ్య తండ్రితో కలిసి రాజకీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇంట్లో జరుగుతున్న ముఖ్య నేతల మీటింగ్‌లకే కాదు.. నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలకు కూడా అెటెండ్ అవుతున్నారు. మంగళవారం గరివిడిలో జరిగిన వైసీపీ చీపురుపల్లి నియోజకవర్గ సమావేశానికి తండ్రితో కలసి వచ్చారు.
రాజ్యసభకు బొత్స- అసెంబ్లీకి కుమార్తె
బొత్స సత్యనారాయణను రాజ్యసభకు పంపే యోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు నియోజకవర్గ బాధ్యతలను కుమార్తెకు అప్పగించాలనుకుంటున్నారు. అందుకు ఆమెను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను పోటీ చేయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లి పరిధిలోని ఓ మండలం నుంచి ఆమె జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా అంతటా టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో జెడ్పీ పీఠంపై వైసీపీకి ఆశలు లేవు కానీ.. అసెంబ్లీ ఎన్నికల సమయానికి జెడ్పీటీసీ పనిచేసిన అనుభవం పనికొస్తుందని భావిస్తున్నారు.





















