(Source: ECI/ABP News/ABP Majha)
Telangana BJP : తెలంగాణ బీజేపీని హైకమాండ్ ముంచుతుందా ? తేలుస్తుందా ?
తెలంగాణ బీజేపీని హైకమాండ్ కాపాడుతుందా ?జాతీయ రాజకీయాల కోసం బలి పెడుతున్నారా?బండి సంజయ్ పదవిపై ఊగిసలాట ఎందుకు?ఇప్పటికే పుంజుకున్న కాంగ్రెస్ ఇంకా ఆలస్యం చేస్తే రేసు నుంచి వైదొలినట్లే !
Telangana BJP : తెలంగాణ బీజేపీ ఇప్పుడు సంధి దశలో ఉంది. గతంలో పాదయాత్రలని.. మరొకటని జోరుగా ప్రజల్లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. మా పదవుల్ని తీసేయడం లేదని మీడియాకు వివరణ ఇచ్చేందుకు సమయం వెచ్చిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం జోరు మీద ఉంది. బహిరంగసభలు.. పాదయాత్రలు..చేరికలతో తీరిక లేకుండా ఉంది. పనైపోయిందన్న కాంగ్రెస్ జోరు మీదకు రావడానికి.. ఊపు మీదుందనుకున్న బీజేపీ వెనుకబడిపోవడానికి కారణం ఎవరు ? ఖచ్చితంగా పార్టీ హైకమాండే. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో పార్టీ నేతల్ని అయోమయంలోకి నెట్టారు.ఇప్పటికీ అది కొనసాగుతోంది.
బండి సంజయ్ కొనసాగింపుపై లేని స్పష్టత
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చింది. దీనికి కారణం ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడమే. కేసీఆర్‌పై నిర్మోహమాటంగా ఎటాక్ చేస్తూ.. పాలనా వైఫల్యాలపై చురుగ్గా ప్రజ్లలోకి వెళ్లారు. కేసీఆర్ అవినీతిపై గట్టిగా ప్రచారం చేస్తూ జైలుకు పంపిస్తామని పలుమార్లు ప్రకటించారు. కేంద్రంలో అధికారం ఉన్న మద్దతుతో బండి సంజయ్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. పాదయాత్రలు చేశారు. ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో మంచి పలితాలు సాధించారు. కానీ ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. పార్టీ వ్యహారాల ఇంచార్జ్ వచ్చి చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఎప్పటికప్పుడు నాయకత్వ మార్పు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.
పార్టీలో అంతర్గత సమస్యలకు హైకమాండే కారణం !
పార్టీలో అంతర్గత సమస్యలకు పూర్తిగా హైకమాండ్‌దే బాధ్యతని బీజేపీ క్యాడర్ అంతృప్తిగా ఉంది. పార్టీలో చేరికలను విస్తృతంగా ప్రోత్సహించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ వారి బాధ్యతలేమిటో.. వారికి లభించే ప్రాధాన్యం ఏమిటో మందుగానే వారికి క్లారిటీ ఇచ్చినట్లయితే.. వారు మరింత ప్రాధాన్యం కోసం ఆశపడేవారు కాదనే వాదన ఉంది. కానీ అలా చెప్పకపోవడం.. ఈటల రాజేందర్ ను పార్టీలోకి తీసుకున్న సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో ఆయనలో అసంతృప్తి ప్రారంభమయింది. అంతే కాదు కొత్తగా చేరిన .. ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారు ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ ప్రభావం పార్టీపై పడింది. పలుమార్లు ఢిల్లీకి సీనియర్ నేతలను పిలిపించుకున్నా.. సమస్యకు పరిష్కారం చెప్పకుండా పంపేశారు. ఫలితంగా అంతర్గత సంక్షోభం ముదిరిపోయింది.
బీఆర్ఎస్‌తో సామరస్య వాతావరణంతో మొదటికే ముప్పు !
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలేనన్నట్లుగా ఇక బీఆర్ఎస్‌తో ముఖామఖి పోరు ఉందని.. బెంగాల్ తరహాలో పోరాటమేనని బీజేపీ నేతలు అనుకున్నారు. తీరా చూస్తే.. మొత్తం కాల్పుల విరమణ జరిగిపోయినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇది తమ పార్టీని ఇబ్బంది పెట్టడమే కాదు.. ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని అంచనా వేయలేకపోయారో .. మరో విధమైన రాజకీయ వ్యూహం ఉందో కానీ.. మొత్తంగా పార్టీ నేతల్ని.. పార్టీని నమ్ముకున్న క్యాడర్‌ని..బీఆర్ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వారికి షాక్ ఇచ్చినట్లయింది. వారిలో మరో ఆలోచన ఏర్పడేలా చేసింది.
ఇప్పటికీ బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. బండి సంజయ్ ను కేంద్రమంత్రిని చేసి కిషన్ రెడ్డిని మళ్లీ తెలంగాణ చీఫ్ ను చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే అసలు రేసులో లేకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన తెలంగాణ బీజేపీ నేతల్లోనే ఏర్పడుతోంది.