Rahul Gandhi Issue : రాహుల్ గాంధీపై అనర్హతా వేటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా ? విపక్షాలన్నీ ఏకమవుతాయా ?
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా ?చిన్న కారణంతో ఎలిమినేట్ చేస్తారా?తీవ్ర నేరాల కేసులు ఉన్న వారెందుకు టెన్షన్ లేకుండా ఉన్నారు ?ప్రజలు ఎలా స్పందిస్తారు ?
Rahul Gandhi Issue : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై 24 గంటలు గడవక ముందే లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం.. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామంటూ లోక్ సభ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు.. ఈ చర్యపై విపక్షాలు భగ్గు మంటన్నాయి.. కాంగ్రెస్ ను దూరంగా ఉంచే పార్టీలు సైతం ఇప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని బిఎర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ వ్యాఖ్యానించారు.. ఇక రాహుల్ అంటే మండిపడే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సైతం రాహుల్ పై వేటు బిజెపి నియంతృత్వ ధొరణికి నిదర్శనమంటూ మండి పడ్డారు. వామ పక్షాలు ఈ చర్యను ముక్త కంఠంతో ఖండిచాయి.. డిఎంకె అధినేత స్టాలిన్ ఒక చిన్న మాటకే అంత పెద్ద శిక్ష విధించడం బిజెపి అధిపత్య పోకడే నంటూ తప్పు పట్టారు.. రాహుల్ తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదంటూ పేర్కొన్నారు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి ఈ చర్యను తప్పుపట్టారు.. విపక్షాల గొంతును ఇంట, బయట కూడా వినిపించకుండా చేయడమే బిజెపి లక్ష్యంగా మారిందన్నారు. లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని అనర్హత వేటు వేయడం విస్మయం కలిగిస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. యావత్ దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
రాహుల్ పై అనర్హతా వేటుపై దేశ ప్రజల్లో విస్తృత చర్చ!
రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో ఇలా శిక్ష వేయడం అలా ఆయనపై ఎంపీగా అనర్హతా వేటు వేయడం సంచలనంగా మారింది. నిజానికి రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పుడే.. ఆ కేసు అంత తీవ్రమైనదా అని ప్రజలు పరిశీలించారు. నిజానికి అది రాజకీయ విమర్శల కేసు. సాధారణంగా ఇలాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకుడు మాట్లాడిన ప్రతి మాటకు పెడార్థాలు తీసుకుని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కోర్టులకు వెళ్లడమో.. కేసులు పెట్టడమే చేస్తూంటారు. కానీ ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ మాత్రమే. ఎందుకంటే దేశంలో ఉన్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు మాట్లాడుకోవచ్చు. మనోభావాలు దెబ్బతీశాయా లేదా అన్నది నిర్ధారించడానికి ప్రత్యేకమైన ప్రమాణాలేమీ లేవు. కానీ రాహుల్ విషయంోల నిర్ధారించింది. కఠినమైన శిక్ష విధించింది. అయితే రాహుల్ లాంటి నాయకుడికి విధించడంతోనే అసలు సమస్య వచ్చింది. ఆయనపై కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయం ఓ వర్గం బలంగా వినిపించడానికి కారణం అవుతోంది.
నియంతృత్వ దిశగా మోదీ వేస్తున్న అడుగుగా అనుమానిస్తున్న విపక్షాలు !
దేశంలో రాజకీయ నేతలు చేసిన నిజమైన నేరాలకు శిక్షలు పడటం అరుదు. రాజకీయం అన్న తర్వాత నేతలు అనేక మాటలు అనుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అసందర్భ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఏం జరిగినా ప్రత్యర్థులకు అంటించడమే రాజకీయం అనేలా మారిపోయింది. చాలా మంది పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. విచారణలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి కానీ.. కానీ ఇంత వరకూ ఎవరికీ శిక్షలు పడలేదు. నిజానికి పరువు నష్టం కేసుల్లో ఇంత కఠినమైన శిక్షలు వేస్తారని ఎవరూ అనుకోరు. కానీ సూరత్ కోర్టు రాహుల్ గాంధీని ఇలాగే వదిలేస్తే.. అంతకు మించిన మాటలంటారని ఊహించింది. మొత్తానికి రాహుల్ గాంధీపై విధించిన శిక్ష మాత్రం దేశ రాజకీయ పరిస్థితులపై భిన్నమైన వాతావరణాన్ని కల్పించింది ఈ మాటలకే రెండేళ్ల జైలు శిక్ష వేస్తే.. రాజకీయ నాయకులందరికీ శిక్షలు పడాల్సిందేనని సెటైర్లు వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలు, నేతలు ఉండకూడదన్న కుట్రలో భాగమేనని విపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచీ వ్యతిరేకత !
ప్రతి చిన్న అంశానికీ అనర్హతను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పదవి కోల్పోయిన వ్యక్తిగా రాహుల్ కు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందన్న ఆయన.. ఒక వేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని తమదైన శైలిలో సమర్థిస్తున్నారు.
లోక్ సత్తా జేపీ గారు,
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 24, 2023
మీ ప్రకటన ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కలిగిస్తూంది.
#Mp & #MLA లను రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న వాస్తవాన్ని మీరు గుర్తించాలి. దీంట్లో రాజకీయ కోణం లేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇది వాస్తవం.
గత చరిత్రలో,
1) జె. జయలలిత అన్నాడీఎంకే (1/3) pic.twitter.com/1QOXaaXuKM
దేశ ప్రజలు ఎలా స్పందిస్తారు ?
సాధారణంలో ప్రధాని పదవికి పోటీలో ఉన్న వ్యక్తిగా రాహుల్ గాంధీని దేశ ప్రజలు చూస్తారు. ఆయనను ఓ చిన్న కారణంతో అసలు పోటీ లేకుండా ఎలిమినేట్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటి వరకూ మన ప్రజాస్వామ్యంలో అలా జరగలేదు. ఎంతో మంది రాజకీయ నేతలు అంత కంటే తీవ్ర నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. అందులో వేల కోట్ల అవినీతి దగ్గర్నుంచి హత్యల వరకూ అత్యంత క్రూరమైన నేరాలు ఉన్నాయి. వారి కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నయి. వారెవరి కేసులు తేలడం లేదు. అనర్హతా వేటు పడటం ేదు. ఈ భావన ఎక్కువ మంది ప్రజల్లో ఉంది. అదే రాహుల్ గాంధీపై సానుభూతి పెరగడానికి కారణం అయితే మొత్తం రాజకీయం మారిపోతుంది. అందుకే రాహుల్ గాంధీపై అనర్హతా వేటు.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిందని అనుకోవచ్చు.