Peddireddy Disqualification: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవి పోతుందా? అనర్హత నుంచి బయట పడతారా?
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వేసిన అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 214లోనూ ఇదే తరహాలో ఆయనపై పిటిషన్ నమోదైనా ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ముప్పురాలేదు.
YSRCP MLA Peddireddy Ramachandra Reddy | వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలాగైనా ఓడించాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైనా బోడె రామచంద్రయాదవ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ ఈనెల 4న హైకోర్టులో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కేసు దాఖలు చేశారు. గత బుధవారం ఈ కేసును విచారించిన జడ్జి వి. శ్రీనివాస్ కేసును జులై 30వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు. ఒకవేళ ఈ కేసులో రామచంద్రయాదవ్‌కు తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశాలున్నాయి.
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి కుటుంబం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రధాన శాఖలకు పెద్దిరెడ్డి మంత్రిగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతంలో వైసీపీకి పెద్దిరెడ్డి ప్రధాన నాయకుడిగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలో కొనసాగినంతకాలం ఆయన మాటకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఎదురే లేకుండా ఉండేది. పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ముగ్గురు పదవుల్లో ఉన్నారు. పెద్దిరెడ్డితో పాటు తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డి మరోసోదరుడు సుధీర్‌రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ప్రయత్నించినా కుదరలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం పెద్దిరెడ్డి తన కనుసైగతో చిత్తూరు జిల్లాను శాసించేవారని పేరుంది. అప్పట్లో జరిగిన కుప్పం పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీడీపీని ఘోరంగా ఓడించడం ద్వారా జగన్ దగ్గర మరింత పలుకబడి సంపాదించారు పెద్దిరెడ్డి.
కూటమి ప్రభుత్వం రాకతో పెద్దిరెడ్డికి కష్టాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి ప్రభ తగ్గిపోయింది. తన నియోజకవర్గానికి రావడానికే నానాఅవస్థలు పడుతున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా తననను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటే, మొన్నటికి మొన్న మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన కొడుకు మిథున్‌రెడ్డిపైన కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆయన కారును సైతం తగలబెట్టడంతో ఎక్కడికి పోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. దీనికితోడు వరుస కేసులతో కూటమి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది. తాజాగా మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన పెద్దిరెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా బోడె రామచంద్రయాదవ్ సైతం ఎలాగైనా పెద్దిరెడ్డిని దించాలనే పట్టుదలతో ఉన్నారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు, ఆయన మాత్రం ఎమ్మెల్యేగా ఉండటానికి వీళ్లేదంటూ అనర్హత వేటు వేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. జూలై4న హైకోర్టులో రామచంద్రయాదవ్ అనర్హత పిటిషన్ కేసు దాఖలు చేశారు. హైకోర్టు ఈపీ నెంబరు 3/2024 తో ఈ కేసును విచారణకు స్వీకరించింది. బుధవారం జడ్జి శ్రీనివాస్ విచారణ జరిపి తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు.
ఎన్నికలకు వారం ముందు నుంచే..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పెద్దిరెడ్డి అనర్హతపై రామచంద్రయాదవ్ పోరాటం మొదలు పెట్టారు. ఎన్నికలకు వారం రోజుల ముందు జూన్ 7న పెద్దిరెడ్డి తన నామినేషన్ అఫిడవిట్‌లో తన భార్య స్వర్ణలత, తన పేరుపై ఉన్న 142 ఆస్తుల వివరాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఆయన్ను పోటీ చేయకుండా అడ్డుకోవాలని రామచంద్రయాదవ్ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్, ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అయినా పెద్దిరెడ్డి పోటీ చేసి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)సై పుంగనూరు నుంచి 6 వేల పైచికలకు మెజారిటీతో విజయం సాధించారు.
2014లోనూ ఇదే తరహా పోరాటం..
2014లో ఎన్నికల్లోనూ పుంగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణరాజుపై గెలుపొందారు. అప్పుడూ ఇదే విధంగా ఎన్నికల అఫిడవిట్‌లో పెద్దిరెడ్డి కొన్నిచోట్ల సంతకాలు చేయలేదని, కోట్ల విలువైన ఆస్తులు వివరాలు చూపలేదని, ఒక కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న తన భార్యను గృహిణిగా చూపారంటూ వెంటకరమణరాజు హైకోర్టును ఆశ్రయించారు. 2016 ఆగస్టులో హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ ప్రిలిమనరి ఫీడింగ్ సరిగాలేదని కేసును కొట్టివేశారు. అయినా 2016 అక్టోబరులో వెంకటరమణరాజు మళ్లీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదులు సిద్దార్ధలూద్రా, ఆనంద్, కేఎస్ మదన్ ద్వారా పిటిషన్ వేయగా సుప్రింకోర్టు ఆ కేసును విచారణకు స్వీకరించింది.
పెద్దిరెడ్డి అనర్హతపై ఇప్పటికే సుప్రీంకోర్టులో 18 సార్లు వాదోపవాదాలు జరగ్గా తుదితీర్పు రిజర్వులో ఉంది. వివిధ కారణాలతో వెంకటరమణరాజు కేసుపై ఆసక్తి చూపకపోవడంతో పెద్దిరెడ్డి అనర్హత వేటు కేసు మూతపడింది. ఇప్పుడు మళ్లీ రామచంద్ర యాదవ్ హైకోర్టులో అనర్హత కేసు వేయడంతో పుంగనూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది.