(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Telangana Politics : చంద్రబాబు మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అవుతారా ? భద్రాచలం టూర్ తర్వాత టీడీపీలో ఏం జరుగుతోంది ?
తెలంగాణలో మళ్లీ చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారా?. భద్రాచలం పర్యటన తర్వాత నిర్ణయాల్లో మార్పులు కనిపించాయా ?
Chandrababu Telangana Politics : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో అప్పుడప్పుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. కానీ యాక్టివ్‌గా ఉండటం లేదు. ఉన్న కొద్ది మంది నేతలతో సమావేశమై ఏం చేయాలో చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ బలపడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం రంగంలోకి దిగడం లేదు. అయితే అనూహ్యంగా విలీన మండలాల పర్యటనకు వెళ్లినప్పుడు భద్రాచలంలో ఆయన పర్యటనకు వచ్చి న స్పందన చూసిన తర్వాత టీడీపీ నేతలు బహిరంగసభ నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చారు. దానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అవడం కష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చంద్రబాబుకు అనూహ్య స్పందన !
పోలవరం విలీన మండలాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి రాకపోకలు సాగించాల్సి వచ్చింది. భద్రాచలంలో రాత్రి బస చేశారు. శ్రీరాముడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జనం పోటెత్తారు. విపరీతమైన స్పందన రావడం టీడీపీ నేతల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీడీపీలో అన్ని స్థాయిల నేతలూ పార్టీని వీడారు. అభిమానం ఉన్నప్పటికీ... నాయకుడు లేకపోవడంతో అందరూ ఇతర పార్టీల్లో సర్దుకున్నారు. అయినప్పటికీ క్యాడర్ అభిమానంతో ఉందని చంద్రబాబు పర్యటన రుజువు చేసింది.
ఉమ్మడి ఖమ్మంలో బహిరంగసభకు ప్లాన్ !
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గతమెంతో ఘనం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలూ వలస పోయారు. గట్టి నాయకత్వం లేకపోవడంతో అభిమానం ఉన్నా ఓట్లు వేసే పరిస్థితి లేదు. అయితే నమ్మకం కలిగిస్తే బలం పుంజుకునే చాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని రావాలని ఆహ్వానించారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి కనిపిస్తున్నందున టీడీపీ నేతలు తాము కూడా రేసులో ఉండాలని అనుకుంటున్నారు.
ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు యాక్టివ్ అవ్వగలరా !?
అయితే చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నేతల్ని ప్రోత్సహిస్తారు కానీ నేరుగా ఆయన రంగంలోకి దిగకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే... చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ గత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్ రేపి విజయం సాధించారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఈ సారి ఆయన కేసీఆర్‌కు ఆ చాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే చాన్స్ వస్తే పార్టీని పునరుజ్జీవింప చేయడానికి ఏ మాత్రం సందేహించరని అందుకే తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం చంద్రబాబకు ఉంది !
ఏపీ కంటే ముందే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ కారణంగా చంద్రబాబు కాస్త సమయం కేటాయించడానికి చాన్స్ ఉంది. కానీ ఏపీలో గెలవడం.. చంద్రబాబుకు అత్యంత ముఖ్యం. అందుకే పూర్తి సమయం ఈ సారి ఏపీకే కేటాయిస్తారని చెబుతున్నారు. తెలంగాణ నేతల్ని ప్రోత్సహిస్తారు కానీ నేరుగా రంగంలోకి దిగకపోవచ్చంటున్ారు. ఈ సారికి మాత్రం పూర్తి స్థాయిలో చంద్రబాబు ఏపీకి పరిమితమవుతారని అంటున్నారు. రాజకీయ పరిస్థితులు మారితే అప్పుడు తెలంగాణపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందంటున్నారు.