Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?
తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ? బీజేపీ నేతలకు ఇబ్బంది అవుతుందని ఆలోచించలేదా ?
Telangana BJP : తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని మోదీ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూంటారు. దక్షిణాదిలో అయినా ఇతర రాష్ట్రాల్లో అయినా చివరికి పార్లమెంట్ లో అయినా ఆయన ప్రసంగాల్లో ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తీరుపై వ్యాఖ్యలు చేస్తూంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాత పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు. అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. కానీ తెలంగాణ ఏర్పాటు ఎలా జరిగిందనే చర్చ మాత్రం తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా చేసిన విభజన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనేది బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసిన ప్రక్రియ. ఈ క్రమంలో లైవ్ టెలికాస్ట్ ఆపేశారా.. పార్లమెంట్ తలుపులు మూసేశారా.. తర్వాత ఏమైనా జరిగిందా అన్నది తర్వాత సంగతి. కానీ ఈ రెండు పార్టీలకు సమాన బాధ్యత ఉంది. ప్రజలుక్రెడిట్ ఈ రెండు పార్టీలకు కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇచ్చారు. అది రాజకీయ అంశం. టెక్నికల్ గా చూస్తే రెండు పార్టీలు చేసిన విభజన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో ఉద్యమం తీవ్రం అయినప్పుడు... ఇక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అంగీకరించకపోతే సాధ్యమయ్యేది కాదు. బీజేపీ కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఒక్క ఆంధ్రా ప్రాంత ఎంపీలు మాత్రమే వ్య.తిరేకించారు. అదే సమయంలో బీజేపీలో కీలక పొజిషన్ లో ఉన్న ఆంధ్ర ప్రాంత రాజ్యసభ ఎంపీ వెంకయ్య నాయుడు కూడా మద్దతు తెలిపారు. దాంతో రెండు పార్టీలు సగం సగం క్రెడిట్ వచ్చేలా చేసుకుని రాష్ట్ర విభజన చేయాలనుకున్నాయి. అనుకున్నట్లుగా చేశారు.
బీజేపీ విభజనకు సహకరించలేదని మోదీ చెప్పదల్చుకున్నారా ?
కానీ ప్రధాని మోదీ గతంలో బీజేపీ ఏం చేసిందన్నది పట్టించుకోవడం లేదు. విభజన తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రక్తం ఏరులై పారుతోందని కూడా చెబుతున్నారు. కానీ అంత ఏమీ జరగలేదు. ఉద్యమాలు మాత్రం గట్టిగానే జరిగాయి. రెండు రాష్ట్రాలను విడగొట్టి పదేళ్లవుతోంది. రెండు రాష్ట్రాలకూ తమకు విభజన చట్టం ప్రకారం రావాల్సినవి రాలేదని గగ్గోలు పెడుతున్నాయి. వాటి గురించి మోదీ ఎప్పుడూ పట్టించుకోరు. కానీ అయిపోయిన అంశంపై మాత్రం.. ప్రతీ సారి లేవనెత్తి.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూంటారు. విభజనలో తమ రోల్ లేదన్నట్లుగా మాట్లాడుతూంటారు. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు. చేసినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణలో ఆందోళనలు, నిరసనలకు పిలుపునిస్తూ ఉంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో బీఆర్ఎస్,, కాంగ్రెస్ పోటీ పడి నిరసన ప్రదర్శలు చేశాయి. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని , తెలంగాణను ప్రధాని మోదీ అవమానించారని ... రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విరుచుకు పడుతూ ఉంటారు.
రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కుతుందా ?
అయితే ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకమైన కారణాలు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతకాని తనాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారని.. విభజనను వ్యతిరేకించడం లేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ బీజేపీ కూడా భాగమైన విభజనలో తమ పార్టీ తప్పేమి లేదన్నట్లుగా చెబుతూండటమే ఆశ్చర్యకరకంగా మారింది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. తెలంగాణ ఏర్పాటు పై ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది. ఇప్పటి వరకూ తెలంగాణ సాధన ప్రయోజనం అంతా బీఆర్ఎస్‌కే వెళ్తోంది. మోదీ కాంగ్రెస్ దే ఆ క్రెడిట్ అన్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని ఉరయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.