KCR Politics : జాతీయ అంశాలపై నోరు మెదపని నయా దేశ్ కీ నేత కేసీఆర్ - ఈ మౌనం దేనికి సంకేతం !?
కేసీఆర్ జాతీయ అంశాలపై ఎందుకు మాట్లాడటం లేదు ?ఆప్త మిత్రులకూ ఎందుకు మద్దతుగా ఉండటం లేదు ?బీజేపీ వ్యతిరేక సమావేశాలకు ఎందుకు దూరం ?కేసీఆర్ మౌనం దేనికి సంకేతం ?
KCR Politics : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలు ప్రారంభించిన కేసీఆర్.. జాతీయ అంశాలపై మాత్రం పూర్తి సైలెంట్ గా ఉంటున్నారు. విపక్ష కూటముల సమావేశాల్లో పాలు పంచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు కూడా ప్రకటించలేదు. గత మూడు, నాలుగు రోజులుగా చాలా అంశాలపై బీజేపీపై పోరాడుతున్న నేతలంతా ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం నోరు తెరవడం లేదు. చివరికి ఆప్తమిత్రుడు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినా మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు.
కేజ్రీవాల్ కు కష్టం - అందరూ సంఘిభావం తెలిపారు కేసీఆర్ తప్ప!
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వివిధ పార్టీలు సంఘిభావం తెలిపాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను గుంజుకుంటూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై పోరును జాతి పోరాటంగా చెబుతున్న అరవింద్ కేజ్రీవాల్ అందర్నీ కలిసి రావాలని కోరుతున్నారు. ది కేవలం తమ పోరాటమే కాదని ఇది దేశవ్యాప్త పోరాటమంటన్నారు. మమతా బెనర్జీ కేజ్రీవాల్ ను కలిసి మరీ సంఘిభావం తెలిపారు. అయితే ఆప్తమిత్రుడైన కేసీఆర్ మాత్రం కనీసం కేజ్రీవాల్‌కు సంఘిభావం చెప్పలేదు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటనా చేయలేదు.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపైనా విపక్షాల విమర్శలు - కానీ కేసీఆర్ సైలెంట్ !
మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వాధినేత.. శాసనసభకు అధిపతి కాదని.. మోడీ పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలని అన్ని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని.. లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఇది సంప్రదాయాలకు విరుద్దమని రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్, తృణమూల్, మజ్లిస్ సహా అన్ని విపక్ష పార్టీలు అంటున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు.
విపక్ష కూటమి సమావేశాలకూ దూరం !
మరో వైపు కర్ణాటకలో వచ్చిన ఫలితం తర్వాత బీజేపీని ఓడించడానికి విపక్షాలు కూటమి కట్టేందుకు రెడీ అయ్యాయి. 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్ ను కలుస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ కలవలేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి నితీష్ కుమార్‌తోపాటు తేజస్వియాదవ్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరద్ పవార్, తమిళనాడు సిఎం స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. కానీ కేసీఆర్ కు ఆహ్వానం కూడా అందలేదు. కలుస్తామని..కలిసి పని చేద్దామన్న సంకేతాలను కూడా కేసీఆర్ పంపలేదు.
బీజేపీపై విమర్శలు తగ్గించి కాంగ్రెస్‌పై పెంచుతున్న కేసీఆర్
ఎమ్మెల్యేలు, ఎంపీలతో తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. బీజేపీని పల్లెత్తు మాట అన్నట్లుగా ఎవరూ చెప్పలేదు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విమర్శించినట్లుగా చెప్పుకొచ్చారు. నాందెడ్‌లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు శిక్షణా శిబిరం పెట్టి ప్రసంగించారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, షిండే ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఇతర రాష్ట్రాలకు వెళ్లి అందర్నీ కలిసిన కేసీఆర్. ఇప్పుడు వారు పిలిచినా స్పందించడం లేదని చెబుతున్నారు. తనతో కలిసి వస్తాయనుకున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దూరం జరుగుతుండటంతో ఆయన ఏకాకిగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆయన అలా కావాలని అన్ని పార్టీలకూ దూరమయ్యారు. అసలు జాతీయ అంశాలపై మాట్లాడటం మానేశారు.
కేసీఆర్ రాజకీయం భిన్నంగా ఉంటుంది. కొంత కాలం మౌనం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సారి ఆయన అలాంటి నిర్ణయాలేమైనా తీసుకుంటారా లేకపోతే.. తెలంగాణ ఎన్నికలయ్యే వరకూ జాతీయ రాజకీయాలను పట్టించుకోకూడదని అనుకుంటున్నారో త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.