APCID Political Game : ఏపీసీఐడీ రాజకీయ కక్షసాధింపులకు కేంద్రంగా మారిందా? అరెస్టుల్లోనే హడావుడి.. నేరాలెందుకు నిరూపించలేకపోతున్నారు ?
ఏపీ సీఐడీ పదే పదే ఎందుకు వివాదాస్పదం అవుతోంది ? అరెస్టులు వివాదం అవుతున్నా ఎందుకు వెనక్కి తగ్గడం లేదు ?
APCID Political Game : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అప్పటి వరకూ ఆయనపై ఫలానా కేసు నమోదయిందని కానీ ఆ కేసులో అరెస్టులు చేస్తారని కానీ ఎవరూ ఊహించలేదు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాతే బయట ప్రపంచానికి తెలిసింది. ఆయన ఏ కేసు పెట్టారో కూడా అప్పుడే తెలిసింది. రెండు సెంట్ల స్థలం ఎన్‌వోసీని అయ్యన్న, ఆయన కుమారులు ఫోర్జరీ చేశారని కేసు పెట్టారు. ఇలాంటి కేసులు తేలాల్సింది సీఐడీలో కాదు. కానీ తమకు ఫిర్యాదు చేశారు కాబట్టి అరెస్టులు చేశామని సీఐడీ అధికారులు ప్రకటించారు. అసలు ఆ ఎన్వోసీ ఫోర్జరీ అని ఎవరు తేల్చారో కూడా చెప్పలేకపోయారు. చివరికి రిమాండ్ కూడా మేజిస్ట్రేట్ ఇవ్వలేదు. దీంతో సీఐడీపై మరోసారి విమర్శలు రావడానికి కారణం అయింది.
అయ్యన్న, ఆయన కుమారుల్ని అరెస్ట్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు !
అయ్యన్న పాత్రుడ్ని అరెస్ట్ చేయడానికి సీఐడీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కోడెల విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంపై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. కానీ అయ్యన్నను అరెస్ట్ చేయలేకపోయారు. దాదాపుగా అన్ని కేసుల్లోనూ ఆయన కోర్టు నుంచి రక్షణ పొందారు. తనపై పది కేసులు నమోదు చేశారని.. అందులో నిర్భయ కేసు కూడా ఒకటని అయ్యన్న ప్రభుత్వ తీరుపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఫోర్జరీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కానీ జైలుకు మాత్రం తరలించలేకపోయారు. హైదరాబాద్‌లోని ఆయన కుమారుడి ఇంట్లో సీఐడీ పోలీసులు చేసిన రచ్చ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ వీడియోలుగానే ఉన్నాయి.
ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా డైవర్షన్ కోసం అరెస్టులు చేస్తున్నారా ?
సీఐడీపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధానంగా చేసే ఆరోపణ డైవర్షన్. ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీడియాలో ప్రచారం జరగకుండా డైవర్షన్ అరెస్టులు చేస్తున్నారనేది వారి వాదన. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎ ంజగన్ సోదరి షర్మిల సీబీఐ ఏదుట స్టేట్‌మెంట్ ఇచ్చారన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ అంశంపై ప్రచారం జరగకూడదన్న కారణంగానే రాత్రికి రాత్రి సీఐడీ కేసులను అక్రమంగా పెట్టించి తెల్లవారు జామునే అరెస్టు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో జరిగిన అరెస్టులు కూడా ఇదే కారణంతో జరిగాయని.. కానీ ఏ ఒక్క కేసులోనూ వారు కనీసం రిమాండ్‌కు తరలించేలా సాక్ష్యాలు చూపించలేకపోతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులతో విమర్శలు !
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ముందుగా నోటీసులు ఇచ్చి విచారించాలి. అలా ఇవ్వకపోతే సీఐడీకి కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ సీఐడీఅధికారులు ఎప్పుడూ పట్టించుకోలేదు. సీఐడీకి కోర్టుల్లో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. ఇలా నమోదు చేసిన కేసుల్లో ఒక్క దానికీ పక్కా సాక్ష్యాలు చూపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ కేసులోనూ కామన్‌గా వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం అనే ఓ కారణం చూపిస్తున్నారు. కానీ అదెలా అన్నది మాత్రం కోర్టుల్లో నిరూపించలేకపోతున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనేది కూడా నిరూపించలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వడానికి లేదా అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు బాడీ ఓర్న్ కేమెరా పెట్టుకుని వెళ్తారు. కానీ ఏపీ పోలీసులు విచిత్రంగా తాము వెళ్లిన చోటు సీసీ కెమెరాలు ఉంటే వాటిలో ఫుటేజీని డిలేట్ చేయించేస్తారు. పలుమార్లు అరెస్టులపై కోర్టు సీఐడీకి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సీఐడీ లక్ష్యం.. అరెస్ట్ చేసి కొట్టడం లేకపోతే కుటుంబసభ్యుల్ని భయపెట్టడం మాత్రమేనని అందుకే ... ఈ విషయంలో కోర్టుల్ని సైత పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. వారి తీరు చూస్తూంటే ఆ ఆరోపణలు తప్పు కాదనే అభిప్రాయం ఎక్కువ మందికి వినిపిస్తుంది.
అన్నీ కేసుల్లోనూ ఒకే రకంగా వ్యవహరంచకపోవడంతో మరిన్ని విమర్శలు !
సీఐడీ అన్ని కేసుల్నీ అలాగే చూస్తే అసలు వివాదం రాకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫిర్యాదులపై అసలు కేసులే నమోదు చేయడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై సోషల్ మీడియాలో దారుణంగా పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు దాటుతోంది..కానీ స్పందించలేదు. ఇ క మరో నేత గౌతు శిరీష కూడా ఫిర్యాదుచేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించలేదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమెకు అర్థరాత్రి నోటీసులు ఇచ్చారు. టీడీపీ నేతల ఫిర్యాదులే కాదు.. న్యాయవ్యవస్థను కించ పరుస్తూ పెట్టిన పోస్టులపై సాక్షాత్తూ హైకోర్టు ఆదేశించినా చర్యలు తీసుకోలేదు.