Crisis In BRS: కారు దిగిపోతున్న కీలక నేతలు, కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు ?
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
BRS Leaders Jumpings : తెలంగాణ ( Telangana)లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ (BRS)పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections 2024)సమీపిస్తుండటంతో...నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను పక్కాగా అనుసరిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలంతా...పక్క చూపులు చూస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఎంపీలు బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పోతుగంటి రాములు, జహీరబాద్ ఎంపీ బీబీ పాటిల్... పార్టీకి రాంరాం చెప్పేశారు. వారిద్దరూ బీజేపీ కండువా కప్పుకోవడం జరిగిపోయింది. బీబీ పాటిల్‌కు జహీరాబాద్ పార్లమెంట్ స్థానం, ఎంపీ రాములు తనయుడు భరత్‌కు నాగర్‌కర్నూలు ఎంపీ సీటు కేటాయించింది. వీరిద్దరు మొదటి జాబితాలోనే టికెట్ దక్కించుకున్నారు. మరికొందరు నేతలు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఒక్కొక్కరుగా జారుకుంటున్న నేతలు
గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓటమి పాలయింది. మూడోసారి అధికారంలోకి వస్తామని భావించిన గులాబీ పార్టీ అంచనాలు తలకిందులు అయ్యాయి. మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కొందరు నేతలు లెక్కలు వేసుకున్నారు. కేసీఆర్ కూడా మూడోసారి గెలుస్తామని చెప్పడంతో...ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు ముందుకు వెనుక ఆలోచించకుండా కారు ఎక్కేశారు. గులాబీ పార్టీ ఓవర్ లోడ్ అని తెలిసినా...అధికారంలోకి వస్తే పదవులు వస్తాయన్న ఆశతో పింక్ కండువా కప్పేసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడంతో...రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అనుభవించిన నేతలు...ఒక్కొక్కరుగా మెల్లిగా కారు పార్టీకి గుడ్ చెప్పేస్తున్నారు. ఇటు కేంద్రం...అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలలోకి నేతలు జంప్ అవుతున్నారు.
పోయే వారిని బుజ్జగించకూడదని నిర్ణయించిన కేసీఆర్
ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరడం...అంతకుముందు పలువురు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడంతో కారు పార్టీలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ముందు కూడా వలసలు ఇలాగే కొనసాగుతాయా అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు...వలసలు ఏ స్థాయికి చేరుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు...గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఎంత మంది నేతలు వెళ్తున్నా...బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దగా స్పందించడం లేదు. దీనికి కారణాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ వీడే నేతలను బుజ్జగించాల్సిన అవసరం లేదని, అధికారం లేనప్పుడు పార్టీలో కొనసాగే ఆలోచన లేని నేతలు...బయటకు పోతే మంచిదని యోచనలో హైకమాండ్ ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడే కొనసాగాలని అనుకుంటే మంచిదని...లేదు బయటకు వెళతాం అంటే ఇంకా మంచిదంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలని కేసీఆర్ అండ్ కో నిర్ణయించినట్లు తెలుస్తోంది