RTC Politics : కేసీఆర్‌కు కాగల కార్యం బీజేపీ తీర్చేస్తోందా ? ఆర్టీసీ విలీనం అడ్డుకుని సాధించేదేంటి ?
ఆర్టీసీ బిల్లును అడ్డుకుని బీజేపీ సాధించేది ఏమిటి ?బిల్లు ఆమోదం పొందినా ప్రక్రియ పూర్తయ్యేది ఎన్నికల తర్వాతే ! బీఆర్ఎస్ గెలవకపోతే ఏదైనా జరగొచ్చు ! బిల్లు అడ్డుకున్న పేరు బీజేపీకి ఎందుకు ?
RTC Politics : తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పడు అనూహ్యంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల గొడవల్లో గవర్నర్ రావడం అనూహ్యంగా మారింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపాల్సినంత అవసరం లేదు. బిల్లులు ఇలా గవర్నర్ వద్దకు వెళ్తే ఎలాంటి కొర్రీలు పెట్టరు. ఎందుకంటే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మళ్లీ గవర్నర్ ఆమోదంతోనే గెజిట్ రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు ఉంటే అప్పుడు చెప్పవచ్చు. అసలు అసెంబ్లీలోనే బిల్లు పెట్టుకుండా ఆపాలనుకోవడంతోనే తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను రంగంలోకి దింపింది. దీంతో బీజేపీ మరింత ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయిది.
గవర్నర్ బిల్లు ఆపడంతో కార్నర్ అవుతున్న బీజేపీ
తెలంగాణ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని కూడా చూడాల్సి వస్తోంది. ఆర్టీసీని .. ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని .. హుటాహుటిన బిల్లు తయారు చేయించి.. గవర్నర్‌కు పంపారు. కానీ గవర్నర్ ఎప్పట్లాగే తన వద్దే అట్టి పెట్టుకున్నారు. విషయం బయటకు రావడం…. అసెంబ్లీ సమావేశాలను నేడే ముగించాలని నిర్ణయించడంతో వివాదాస్పదమయింది. అర్థరాత్రి సమయంలో గవర్నర్ బిల్లును తిరిగి పంపించారు. తన సందేహాలను సమాధానాలు కావాలని లేఖ రాశారు. ప్రభుత్వం సమాధానాలిచ్చింది. కానీ గవర్నర్ సంతృప్తిపడలేదు. మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ కావాలనే ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది.
కేసీఆర్ వ్యూహం వేరే అంటున్న బీజేపీ
బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఉద్యోగుల్ని రంగంలోకి దింపారు. చలో రాజ్ భవన్ నిర్వహించేలాచేశారు. ఇలా ఉద్యోగులు.. రాజ్ భవన్ మీదకు వెళ్లడం అంటే.. చిన్న విషయం కాదు. అయితే … ఈ విషయాన్ని వీలైనంత రాజకీయం చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బీజేపీ ఆర్టీసీ కార్మికులకు మేలు చేయకుండా అడ్డు పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని డిఫెండ్ చేసుకోవడం… బీజేపీ నేతలకు ఇబ్బందికరం. అందుకే ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. బండి సంజయ్ లాంటి వాళ్లు గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి ఆర్టీసీ ఉద్యోగుల్ని కాల్చాలనిచూస్తోందని ఆరోపిస్తున్నారు. అసలు ఆర్టీసీ బిల్లు లో ఏదో ఓ లొసుగు పెట్టి కేసీఆర్.. విలీనాన్ని ఆలస్యం చేస్తారని… బీజేపీ నేతలు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణం తామేనని ఆరోపించే పరిస్థితి రావడం వారికి ఇబ్బందికరంగా మారింది.
ఆర్టీసీ బిల్లు ఆమోదించినా విలీనం ఎన్నికల్లోపు కష్టమే !
ఆర్టీసీ బిల్లును అసెంబ్లీ ఆమోదించినా.. అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే.. అసలు బిల్లు ఆర్టీసీ విలీనం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల్ని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు. అంటే ప్రభుత్వం ఇస్తుంది. వారు ఆర్టీసీ కోసం పని చేస్తారు. ఆర్టీసీకి జీతాల ఖర్చు మిగులుతుంది. కానీ ప్రభుత్వం అది ఏదో విధంగా ఆర్టీసీ నుంచే వసూలు చేసుకుంటుంది. ఈ ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ పరిష్కరకించి.. వారిని ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగమనో.. మరో పేరు పెట్టి కొత్తశాఖ ఏర్పాటు చేసి వారినిఆ విభాగం ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ కేటీఆర్ అక్టోబర్‌లోనే ఎన్నికలు వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. అంటే.. ఏదైనా ప్రక్రియ పూర్తి అయ్యేది ఎన్నికల తర్వాతేనన్నమాట. ఇంత దానికే బీజేపీ ఎందుకు రిస్క్ తీసుకుంటుందనేది కీలకం.