Lokesh Delhi : ఢిల్లీలోనే లోకేష్ మకాం ! అరెస్ట్ చేస్తారనా ? న్యాయపోరాటం కోసమా ?
నారా లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు ? ఏపీకి వస్తే అరెస్ట్ చేస్తారని అక్కడే ఉంటున్నారా ?
Lokesh Delhi : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి వారం దాటిపోయింది. రెండు, మూడు రోజుల్లో అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని మళ్లీ తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన తిరిగి రాలేదు. మరో వైపు ఏపీలో లోకేష్‌నూ అరెస్టే చేస్తామని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ నూ అరెస్ట్ చేస్తే తదుపరి కార్యాచరణను టీడీపీ ఖరారు చేసుకుంది. నారా బ్రాహ్మణిని తెరపైకి తీసుకు వస్తున్నారు. రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. యూత్ ఐకాన్ అవుతారని టీడీపీ నేతలు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు ?
నారా లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. ప్రధాని మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాలను కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ తమ పార్టీకి మద్దతు తెలుపుతున్న వారికి మాత్రం సమయం ఇస్తున్నారు. బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటి వారు వచ్చి లోకేష్‌కు సంఘిభావం చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లిన మొదటి రెండు రోజులు జాతీయ మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చారు. అయితే లోకేష్ న్యాయపరమైన అంశాల్లో చురుగ్గా ఉన్నారని అంటున్నారు. వ్యక్తిగత పనులపై విదేశాల్లో ఉన్న ప్రముఖ లాయర్ హరీష్ సాల్వేను చంద్రబాబు కేసులో వాదించేందుకు ఆయన ఒప్పించారని చెబుతున్నారు.
తదుపరి న్యాయ చర్యల కోసం ఢిల్లీలోనే లోకేష్
చంద్రబాబును సుదీర్ఘంగా జైల్లో ఉంచే కుట్రను ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని లోకేష్ భావిస్తున్నారు. ఈ అంశంపై స్పష్టత ఉండటంతో న్యాయపరంగా పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు ఢిల్లీ కేంద్రంగా ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నరు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది. ఆ పిటిషన్ పై హైకోర్టులో ఆశించిన తీర్పు రాకపోతే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఢిల్లీలో ఉండి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయింది. క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే.. ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ పై అనుకూల తీర్పు వస్తుందని టీడీపీ నేతలు అనుకోవడం లేదు. అందుకే.. వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ..అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు.
జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని .. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత దారుణమైన సంస్కృతి తీసుకు వచ్చారని ఇలాంటి ప్రమాదక పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాయని లోకేష్ ఢిల్లీలో రాజకీయ పార్టీలన్నింటికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుండి ఉన్న పరిస్థితులు... ఇతర అంశాలపై వివరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపించేలా న్యాయప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని అనుకుంటున్నారు. ఆ తర్వాతే ఢిల్లీ నుంచి రావాలని అనుకుంటున్నారు. గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పు ఇవ్వనున్నారు. ఆ తర్వాత లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.