గెలవాలంటే త్యాగాలు చేయాలి- దేవినేని ఉమను టార్గెట్ చేసుకున్న కేశినేని నాని !
సొంత పార్టీ నేతలయినా, ప్రతిపక్షాలానై, చివరకు అధినేత అయినా సరే మనసులో ఉన్నద్ది చెప్పేయడంతో దెబ్బకు థింకింగ్ మార్చేస్తారు కేశినేని నాని.
బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అదేనండీ కేశినేని నాని మరోసారి తన మార్క్ డైలాగ్స్‌తో రెచ్చిపోయారు. అప్పట్లో నేరుగా పార్టీ అధినేతపైనే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన ఈసారి జిల్లాలోని ఓ సీనియర్ లీడర్‌ను టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. నేరుగా ఆ లీడర్ పేరు చెప్పకపోయినా సరే అనుకున్న వ్యక్తికే తగిలేలా డైలాగ్స్ పేల్చారు.
సొంత పార్టీ నేతలయినా, ప్రతిపక్షాలానై, చివరకు అధినేత అయినా సరే మనసులో ఉన్నద్ది చెప్పేయడంతో దెబ్బకు థింకింగ్ మార్చేస్తారు కేశినేని నాని. సంక్రాంతి వేళ దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేసుకున్నారు కేశినేని నాని. ఎవరయినా సరే పార్టీని గెలిపించేందుకు త్యాగాలు చేయక తప్పదన్నారు.
కొండపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి కేశినేని నాని ముఖ్య అతిథిగా హజరయ్యారు. విజేతలకు బహుమతులు అందించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేశినేని నాని... మొదట వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఆదేటైంలో సొంత పార్టీ నేతలపై కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
ముందుగా మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు కేశినేని నాని. ఆయనకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఉన్నాయని కామెంట్ చేశారు. తాను ఎంపీగా గెలిచాను కాబట్టి వైసీపీ శాసన సభ్యులు నిర్వహించే కార్యక్రమానికి వెళ్ళే అధికారం ఉందన్నారు. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి వైసీపీ శాసన సభ్యులు గెలిచిన నియోజకవర్గాలకి కూడా నిధులు ఇచ్చానని గుర్తు చేశారు. ఇచ్చిన డబ్బు తనది, పార్టీది కాదని... కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవని అందుకే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు వాటిని ఖర్చు చేస్తానన్నారు.
సొంత పార్టీ నేతలపై కూడా కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు. ఈసారీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ త్యాగాలకు సిద్దం కావాలన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళైనా సరే పారీని అధికారంలోకి తీసుకురావటానికి పని చేయాల్సి ఉంటుందన్నారు. చివరకు తానైనా సరే పార్లమెంట్ స్థానంలో తాను గెలిచే అవకాశం లేదని చంద్రబాబు భావిస్తే వేరొకరిని నిలబెట్టి సీటు ఇస్తే గెలిపించాల్సిన బాధ్యత తనపై కూడీ ఉంటుందని అన్నారు. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పని చేశామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించాలంటే అంతా కలసి కట్టుగా పని చేయక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమా ను ఉద్దేశించి కేశినేని వ్యాఖ్యానించారు. తమ ప్రాంతానికి తామే సామంతులమని భావిస్తే చెల్లదని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గర్వపడిన వారు ఒంటరిగా మిగిలిపోతారని కేశినేని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా వేదికగా ప్రచారం
సోషల్ మీడియా వేదికగా ఇస్టానుసారంగా చేస్తున్న ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని అన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రచారం చేసుకుంటున్నారని,అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు, జగన్‌ను ఓడించాలంటూ, సమిష్టిగా పని చేయక తప్పదని అన్నారు. టిక్కెట్ల కేటాయింపులు వ్యవహరాలు, పార్టీ నాయకత్వం చూసుకుంటుందని, పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే, వారిని గెలిపించేందుకు అంతా సిద్దంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అలాకాదని వ్యవహరిస్తే, మరలా కష్టాలు తప్పవని ఈ విషయాలను పూర్తిగా పార్టీ నేతలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని కేశినేని పేర్కొన్నారు. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు కొత్తేమి కాకపోయినప్పటికి, ఆయన దేవినేని ఉమాను టార్గెట్ చేసి మాట్లాడటం పార్టీలో చర్చనీయాశంగా మారింది.