Telangana Credit Game : "విమోచన"పై టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీలది ఒకే మాట ! "క్రెడిట్ గేమ్"లో గోల్ కొట్టింది ఎవరు ?
తెలంగాణ విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో ఉద్యమం కాస్తా క్రెడిట్ గేమ్ పాలిటిక్స్‌గా మారింది. ఎవరికి ఎక్కువ రాజకీయ ప్రయోజనం కలగబోతోంది ?
Telangana Credit Game : తెలంగాణ రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులతో సాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఎన్నికల హీట్, రాజాసింగ్ వ్యాఖ్యల వివాదాలు ఓ వైపు సాగుతూండగానే అందరికీ సెప్టెంబర్ 17 గొప్ప రాజకీయ అవకాశంగా కనిపించింది. ముఖ్యంగా బీజేపీ అంశాన్ని పకడ్బందీగా వాడుకోవాలని అనుకుంది. తెలంగాణ విమోచనా దినాన్ని అధికారికంగా చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు కాబట్టి..కేంద్రంతో ఆ పని చేయించేసి.. క్రెడిట్ ఖాతాలో వేసుకోవాలనుకుంది బీజేపీ. ఆ విషయంపై సమాచారం అందగానే టీఆర్ఎస్ అప్రమత్తమయింది. తాము ఏడాది అంతా సంబరాలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మజ్లిస్‌ను బూచిగా చూపి టీఆర్ఎస్ ను బీజేపీ కార్నర్ చేయడం ఖాయం కావడంతో.. అనూహ్యంగా ఓవైసీ రంగంలోకి వచ్చారు. మొత్తం విషయానికి ఎండ్ కార్డ్ అన్నట్లుగా విమోచనా దినోత్సవాలను తమ పార్టీ కూడా నిర్వహిస్తుందని ప్రకటించేశారు.
విమోచనను అధికారికంగా నిర్వహించడానికి అధికార పార్టీలు ఎప్పుడూ వ్యతిరేకమే !
భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమయిందా..లేకపోతే విమోచనం కల్పించారా..కొంత మంది వాదించేటట్లుగా విద్రోహమా అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అధికారికంగా నిర్వహించడం అంటూ ఎప్పుడూ లేదు. దానికి కారణాలేమైనా సరే.. అలా నిర్వహిస్తే.. ముస్లింలకు ముఖ్యంగా మజ్లిస్ పార్టీకి ఆగ్రహం వస్తుందని ఆ కారణంతోనే అధికార పార్టీలు సైలెంట్‌గా ఉంటాయన్న ప్రచారం ఉంది. ఎందుకంటే మజ్లిస్ ఏ పార్టీ అధికిారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ అనధికారిక మిత్రపక్షంలా ఉండేది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే సంబంధాలు చెడిపోయాయి. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో అనధికార పొత్తు కొనసాగుతోంది. పాతబస్తీ వైపు టీఆర్ఎస్ కన్నెత్తి చూడదు. అలాగే ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు మజ్లిస్ సహకరిస్తుంది. ఇది బయటకు కనపించని రాజకీయం. కారణం ఏమైనా కానీ తెలంగాణ ఉద్యమసమంయలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. అధికారం చేతికందిన తర్వాత సైలెంటయ్యారు. మజ్లిస్‌కు కోపం వస్తుందని.. ఓవైసీకి ఇష్టం లేదన్న కారణంగానే కేసీఆర్ ఇలా సైలెంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు ప్రతీ సెప్టెంబర్17 సందర్భంలో వచ్చేవి. అయితే ఎప్పుడూ కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు.
బీజేపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కానీ ప్రస్తుతం రాజకీయం మారిపోయింది. బీజేపీ ఆ తెలంగాణ విలీన లేదా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్‌లోనే హైదరాబాద్ స్టేట్ ప్రస్తుతం కలిసిపోయి ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలతో కలిసి కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించాలనుకున్నట్లుగా బయటకు పొక్కింది. కేసీఆర్ కూడా పాల్గొనాలని కిషన్ రెడ్డి లేఖ రాశారు. కానీ అంతకు ముందే తెలంగాణ సర్కార్‌కు సమాచారం రావడంతో... అజాదీ కా అమృత్ మహోత్సవ్ తరహాలో ప్రోగ్రాంను హైజాక్ చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే కేబినెట్ భే్టీలో ఈ మేరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు అధికారికంగా చేయాలని నిర్ణయించారు. ఇవిఏడాది మొత్తం చేసి వచ్చే ఏడాది వజ్రోత్సవ వేడుకలను మరింత ఘనంగా చేయాలని అనుకుంటున్నారు. అంటే కేసీఆర్ ఇప్పటి వరకూ చేయని విధంగా తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా చేస్తున్నారు.
ఊహించని విధంగా తామూ విమోచన వేడుకలు నిర్వహించడానికి మద్దతిస్తామన్న మజ్లిస్ !
ఇంత కాలం తెలంగాణ విలీన లేదా విమోచన వేడుకలు అధికారికంగా చేయకపోవడానికి తామే కారణం అన్నట్లుగా ప్రజల్ని రెచ్చగొట్టేలా ఇతర పార్టీలు వ్యవహరిస్తూండటంతో ఈ రాజకీయాన్ని ఇంతటితోనే తుంచేయాలని ఓవైసీ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా... తమ నిర్ణయాన్ని ప్రకటించారు. విమోచనదినోత్వరం రోజు సమైక్యతాదినంగా పాటించాలని.. పాతబస్తీ మొత్తం తిరంగా యాత్రచేస్తామని ప్రకటించారు. దీంతో ఈ విమోచనంానికి మజ్లిస్ కూడా సానుకూలంగా ఉందన్నమాట.అంటే వ్యతిరేకించేవారు లేరు. వ్యతిరేకించేవారు లేనప్పుడు..పైగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు.. పెద్దగా రాజకీయ అంశం కాదు. అందుకే అన్నిపార్టీలు ఇప్పుడు క్రెడిట్ గేమ్ ప్రారంభించాయి.
విమోచన రాజకీయానికి చెక్ పడినట్లే.. ఇంతకీ క్రెడిట్ ఎవరికి ?
తమ పోరాటంతోనే టీఆర్ఎస్ భయపడిందని.. అందుకే తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించడానికి సిద్ధపడిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఘనమైన తెలంగాణ పోరాట చరిత్రను భావితరాలకు అందించడానికి నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తమపై నిందలు రాకుండా..తామూ భాగమవుతామని మజ్లిస్ చెబుతోంది. అందరూ ఎవరికి వారు క్రెడిట్ తమకే దక్కాలనే రాజకీయాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారో ?