KCR National Party : కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ క్యాడర్ "ఒత్తిడి" - వ్యూహాత్మకమేనా ?
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ క్యాడర్ ఒత్తిడి చేస్తోంది. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారని.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అంటున్నారు.
KCR National Party : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులంతా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు తమ డిమాండ్‌ను కేసీఆర్‌కు .. పార్టీ వేదికగా వినిపించారు. పార్టీ ముఖ్య నేతలకు తెలియకుండా వీరు తెలంగాణ భవన్‌లో సమావేశం కాలేరు. సమావేశం అయినా ఇలాంటి ప్రకటనలు అన్యాపదేశంగా చేయలేరు. పార్టీ హైకమాండే ఇలా చెప్పమని వారికి సందేశం పంపి ఉంటుంది. కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పార్టీ మొత్తం ఆమోదం తెలిపిందని చెప్పుకోవడానికి ఇదో మార్గం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌లోనే ఇలాంటి డిమాండ్ వినిపించడం ప్రారంభమయిందంటే.. ముందు ముందు అన్ని స్థాయిల నుంచి ఈ తరహా ప్రకటనలు వస్తాయి. దీన్ని పీక్స్‌కు తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రజలు కోరుతున్నారన్న వాదన కోసమే పార్టీ నేతల ప్రకటనలు !
తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుతున్నారని... కేసీఆర్ పలుమార్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు బలపరిస్తేనే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని.. మళ్లీ బలపరిస్తే దేశాన్ని తెలంగాణలా బాగు చేస్తానని చెబుతున్నారు. ప్రజలంతా తెలంగాణ పథకాలు కావాలనుకుంటున్నారని ఉత్తరాదిలోనూ ఈ హవా ఉందని అంటున్నారు. నిజానికి రాజకీయ నాయకుల వ్యూహమే అంత. ఏ పని చేయాలనుకున్నా ప్రజలతో కొన్ని డిమాండ్లు చేయించి.. వారు కోరుతున్నందునే చేస్తున్నానని ప్రకటిస్తారు. ఇక్కడ నిర్ణయం రాజకీయ నాయకులదే. కానీ ప్రజలు కోరుతున్నారన్న అభిప్రాయం కల్పించడానికి తమ నిర్ణయాలకు అనుగుణంగా ర్యాలీలు, సభలు..సమావేశాలు నిర్వహించడం పరిపాటి. ప్రస్తుతం కేసీఆర్ కూడా అదే బాటనలో నడుస్తున్నారు. పార్టీ నేతలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.. దేశాన్ని బాగు చేయాలనే వాదన వినిపింప చేస్తున్నారు.
ముందు ముందు అన్ని స్థాయిల నేతల "ఒత్తిడి" !
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని జిల్లాల అధ్యక్షులు కోరారు.. ఇక ముందు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్‌లు, ఫ్లోర్ లీడర్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఇప్పటికే వీరందరితో చర్చించారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాధినేతలను, ఇతర పార్టీల నేతలను కలుస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో రాణించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జాతీయ పార్టీ ప్రకటన !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ఎన్నికల కంటే ముందే జరుగుతాయి కాబట్టి కేసీఆర్ ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత జాతీయ పార్టీపై గురి పెడతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల "ఒత్తిళ్లు" ప్రారంభం కావడంతో ఆయన ముందుగానే రంగంలోకి దిగబోతున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే వారంలో కర్ణాటకు చెందిన జేడీఎస్ నేత కుమారస్వామి హైదరాబాద్ రానున్నారు. ఆయనతో జాతీయ రాజకీయాలు.. మోడీ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో చురుకుగా పర్యటిస్తారు. అయితే సీఎంగా ఉంటూనే జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. వీలు కుదిరిన పార్టీలతో పొత్తులు.. కూటములు వంటి వాటిపైనా కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
ఇంత కాలం ఇదిగో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా.. అదిగో వెళ్తున్నా అని చెబుతూ వస్తున్న కేసీఆర్ ఈ సారి మాత్రం రాజకీయ పార్టీప్రకటన ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అది ఈ నెలలోనే కావొచ్చనేది వారి నమ్మకం.