Central Loans : దేశానికి కోటిన్నర కోట్ల అప్పు ! రాష్ట్రాలకు సుద్దులు చెప్పి కేంద్రం చేస్తున్నదేంటి ?
రాష్ట్రాలను మించి అప్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్రాలకు చెబుతున్న జాగ్రత్తలు కేంద్రం పాటిస్తోందా ?
Central Loans : దేశంలో ఇప్పుడు అప్పుల గురించి విస్తృత చర్చ జరుగుతోంది. దీనికి కారణం శ్రీలంక. శ్రీలంకకు అప్పులు పెరిగిపోయి.. ఆదాయం తరిగిపోయి దివాలా తీసింది. ఇప్పుడా దేశం వడ్డీలు కాదు కదా అసలు కట్టలేక చేతులెత్తేసింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇరుక్కుపోయింది. దిగుమలు లేక అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అందుకే భారత్‌లోనూ శ్రీలంక అంశంపై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని వివరించి..జాగ్రత్తగా ఉండాలని.. శ్రీలంకను చూసి తెలుసుకోవాలని కొన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు ఓ దేశంతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారని.. దేశంతోనే పోల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకారం దేశం అప్పుల గురించి చెప్పాలంటున్నారు. ఆ వివరాలు కూడా పార్లమెంట్ ద్వారా వెల్లడయ్యాయి.
దేశం అప్పు కోటిన్నర కోట్లు !
ప్రస్తుత భారత ప్రభుత్వం నెత్తి మీద ఉన్న అప్పు రూ. 155 లక్షల కోట్లు. మన జీడీపీలో అరవై శాతం. గత ఐదేళ్ల కాలంలోనే ఏకంగా 63 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇంత భారీ మొత్తం అప్పులు చేసి… 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రుణం జీడీపీలో 9 శాతానికి పైగా పెరిగింది. 2019-20లో జీడీపీలో ద్రవ్యలోటు జీడీపీలో 4.1% ఉండగా.. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది జీడీపీలో 9.2 శాతానికి చేరింది. కేంద్రం రాష్ట్రాలకు పెట్టే నిబంధనలు కేంద్రానిక ికూడా వర్తిస్తాయి. కేంద్రం కూడా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే అప్పులు చేయాలి. కానీ అంతకు మించి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తగ్గుతున్న విదేశీ మారక ద్రవ్యం !
పెరుగుతున్న అప్పులు..తగ్గిపోతున్న రూపాయి విలువ.. ద్రవ్యోల్బణం ఇతర కారణాల వల్ల భారత విదేశీ మారకద్రవ్యం తగ్గిపోతోంది. 2021 సెపె్టంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. జూలై 8తో 8.062 బిలియన్ డాలర్లు తగ్గి, 580.252 బిలియన్ డాలర్లకు పడిపోయిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 15వ తేదీతో ముగిసిన వారంలో మరో 7.541 బిలియన్ డాలర్లు తగ్గి 572.712 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. అంటే భారత్ సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనే సూత్రం మర్చిపోకూడదు.
రాష్ట్రాల అప్పులు.. కేంద్రం అప్పులు.. అన్నింటీ భారం ప్రజలపైనే !
అటు కేంద్రం అప్పులు.. కూడా ప్రజలపైనే పడతాయి. ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవీ ప్రజలపైనే పడతాయి. ఎవరు అప్పులు చేసినా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే కట్టాలి. అప్పులు.. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం కారణంగానే దేశ ప్రజలు కట్టాల్సిన పన్నులు కూడా పెరిగిపోతున్నాయని అనుకోవచ్చు. కేంద్రమైనా.. రాష్ట్రాలైనా అప్పులు చేసి.. సంపద సృష్టి చేస్తే ... జీడీపీ పెరుగుతుంది. దాని వల్ల అప్పు పెద్ద భారంగా మారదు. కానీ అప్పులు చేసి అనుత్పాదక వ్యయం చేస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలని శ్రీలంక దుస్థితిని అధ్యయనం చేయాల్సిన పని లేదు. అది బేసిక్ ఆర్థిక సూత్రం.
అప్పులు చేయడం తప్పు కాదు... కేంద్రమైనా, రాష్ట్రమైనా బాధ్యతగా ఉండాలి !
కేంద్రంలో పాలకులైనా... రాష్ట్రాలు.. స్థానిక సంస్థల పాలకులైనా ఆర్థిక వ్యవస్థ పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఓ చోట నుంచి అప్పులు తెచ్చి వారికి ఎంతో కొంత పంచి పెట్టడమో.. మరొకటే చేస్తే మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చనుకోవచ్చు. కానీ అది ప్రజలను కష్టాల్లోకి నెట్టడం అవుతుంది. అంతకు మించి దేశాన్ని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం తప్పు చేసినట్లే. అది ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే అవతుంది.