Controversy Dharmana : వరుస వివాదాలు - వివాదాస్పద వ్యాఖ్యలు ! మంత్రి ధర్మాన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారా ?
మంత్రి ధర్మాన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ఆయన రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారని సన్నిహితులు భావిస్తున్నారు.
Controversy Dharmana : అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉండే ధర్మాన ఇప్పుడు కొందరివాడిగా మిగిలిపోయారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మగవాళ్లు పోరంబోకులని వ్యాఖ్యానించిన ధర్మాన దీనిపై దుమారం రేగుతుందని తెలియనంత తెలివితక్కువ పొలిటీషియన్ కాదు. కాకపోతే ఏదో ఒక రూపంలో తన మాటలు, తన చేతలు నేటి ట్రెండ్ కు అనుగుణంగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారో ఏమో గానీ ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆచీతూచి పద్ధతిగా మాట్లాడే ధర్మాన ఇప్పుడు నోరు జారుతు న్నారు. ఆసరా సభల నుంచి మహిళలు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయించడం.. వారి కోసం వచ్చిన ఆటోలు తీయవద్దని చెప్పడం.. ధర్మాన స్టైల్ కానేకాదు. పెద్దసభ జరిగినపుడు కొంతమంది మధ్యలోనే వెళ్లిపోతారని, అంతమాత్రాన పెద్దగా చూడాల్సిన అవస రం లేదని, తన నియోజకవర్గంలో మనుషులు కాబట్టి తాను చనువుగా మాట్లాడానని ధర్మాన చెప్పుకొచ్చారు. అటువంటపుడు పత్రికల్లో ఆ కథనాలు వస్తే విమర్శించకుండా ఉండాల్సింది. ధర్మాన చనువుతోనే ఏకవచ నంతో పిలిచినా, మగవారిని పోరంబోకులన్నా, అది తన నియోజకవర్గం ప్రజల మీద తనకు ఉన్న హక్కు అని భావించవచ్చు. కానీ రోకు ఉన్న అమ్మ రోకట్లో తల పెట్టి దంచినా ఏమీ అనదన్న సామెత శ్రీకాకుళం లో ఉంది. అలా ధర్మాన మీద మోజు ఉంటే మనవాడేనని జనం ఫీలవుతారు. కానీ ఇప్పుడు ధర్మాన పట్ల ప్రజల్లో ఆ మోజు లేదు. ఈ విషయం ధర్మా నకు కూడా తెలుసు. అయినా కూడా నోరు జారుతు న్నారంటే ఆయన పూర్తిగా ఫ్రస్టేషన్లో ఉన్నారని అర్థం. అది పార్టీ వల్లా.. అధినేత వల్లా అనేది తెలియాల్సి ఉంది.
పనులు జరగడంలేదనే ఫ్రస్ట్రేషన్
ధర్మాన అంటే అభివృద్ధికి చిరునామా అని భావించి 2019 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు గెలిపించారు. కానీ నాలుగేళ్లలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క అభి వృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత జిల్లావ్యాప్తంగా నిధుల వరద పారిందని, వంశధార ఎత్తిపోతలకు సైతం నిధులు వచ్చేశాయని ప్రతి సభ లోనూ చెబుతున్నారు. అలాగే జగన్మోహనరెడ్డే లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయేవారో అన్నట్టే సెలవిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన అంతరంగం అది కాదేమోనన్న భావన కలుగుతోంది. జనాన్ని మభ్య పెట్టగలమేమో గానీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేమన్న భావన ఆయనలో ఉందేమో అనిపిస్తుంది. కొన్నాళ్లు నిధుల లేమి, మరి కొన్నాళ్లు కార్పొరేషన్ జనరల్ ఫండ్ పనులకు శంకుస్థాపన చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అంతకుముందు పనులకు ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడం, కార్యకర్తలు చేసిన పనులకు ఇంత వరకు సొమ్ములు రాకపోవడం వంటివి ధర్మానలో పార్టీ పట్ల నిరాసక్త తకు కారణమని కొంతమంది చెబుతున్నారు. సొంత పార్టీలో ఉంటూ విమర్శించలేక, మంత్రిగా ఉంటూ పనులు చేయించుకోలేక, ఆ విష యం బయటకు చెప్పుకోలేక ధర్మాన ఫ్రస్టేషన్లో పడ్డారని విశ్లేకులు భావిస్తున్నారు.
మా నమ్మకం నువ్వే స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి దూరం
ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్య మంత్రి అమరావతిలో సమావేశాలు నిర్వహిస్తే వరుసగా మూడు సమా వేశాలకు ధర్మాన గైర్హాజరయ్యారు. అదేమంటే పార్టీని, జగన్ నాయ కత్వాన్ని సభల రూపంలో జనంలోకి తీసుకువెళుతున్నానని, అంత కంటే ముఖ్యమంత్రి నిర్వహించే వర్క్ షాపులు పెద్దవి కావన్న భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్ర మాన్ని రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వైకాపా ప్రారంభించింది. కానీ శ్రీకా కుళం నియోజకవర్గంలో దానికి దశ, దిశ నిర్దేశించడానికి ధర్మాన ప్రసాదరావు అందుబాటులో లేరు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన తనయుడు రామ్ మనోహర్నాయుడు కూడా విశా ఖలో ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి ఒక కమిటీని నియమించి క్షేత్ర స్థాయి నుంచి అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకునే ధర్మాన 'మా నమ్మకం నువ్వే జగనన్న'కు ఎటువంటి డైరెక్షన్లు ఇవ్వలేదు.
ఎప్పుడూ లేని విధంగా సామాజిక వర్గాల రాజకీయాలు చేస్తున్న ధర్మాన
ఒక కులం కోసం ఇతరులకు దూరం తాను గెలిచినా ఓడినా కొత్తగా వచ్చేది ఏమీ లేదని పేర్కొంటున్న ధర్మాన ఇప్పటికీ ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేయాల్సి రావ డం విడ్డూరం. ఆయన గెలుపు ఓటములకు అతీతుడు. అయినా కూడా ఓ వర్గానికి దగ్గర కావాలని ఇటీవల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా మిగతా సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటు న్నారు. నగరంలో కళింగకోమట్లు తనకు ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఓట్లే యడం లేదని భావించిన ధర్మాన ఇటీవల వారి మనసు గెలుచు కోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. మార్కెట్లో కళింగ కోమ ట్లంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని తేలిన తరువాత కొత్తవారిని తన వెనుక తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పెద్దిన మురళీకృష్ణ ఇంటికి నలుగురు కళింగకోమట్లను వెంటబెట్టుకుని ఫిబ్రవరి 27న మంగువారితోటకు వెళ్లారు. ఆ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కళింగ కోమట్లు సైతం ధర్మాన అభిమానులే. అది కాకుండా పార్టీ క్యాడర్ ఉండనే ఉంది. వీరందరినీ కాదని కేవలం కళింగ కోమట్లకు మాత్రమే పిలుపు రావడంతో ఆ డివిజన్లో ధర్మాన కోసం దెబ్బలు కాసిన క్యాడర్ గుర్రుగా ఉంది. ఆ తరువాత వారం కేబుల్ ఆపరేటర్ తంగుడు రాజు ఇంటికి కూడా వెళ్లి కళింగ కోమట్లకు తాను ఫ్రెండ్లీ అని ధర్మాన చెప్పుకొ చ్చారు. దీంతో నగరంలో కళింగ కోమట్లు తప్ప మిగతా కులాలు లేవా... తాము ధర్మాన శ్రేయోభిలాషులం కాదా అన్న చర్చ మొదలైంది. ఈ విష యం కూడా ధర్మానకు తెలుసు. అయినా కూడా ఆయన కళింగకోమ ట్లను కలవడానికి వెనుకడుగు వేయడం లేదు. డబ్బులు ఉన్న కోమట్లకు ఫోన్ చేసి ఆత్మీయ సమావేశాలు పెట్టమని చెబుతున్నారట. అయితే పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తమను ఇబ్బంది పెట్టకండంటూ చాలామంది తప్పించుకు తిరుగుతున్నట్లు భోగట్టా. అధికార పార్టీ పరిస్థితి కళింగకోమట్లలో ఇలా దిగజారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కనీసం ఒక 12మంది కళింగకోమటి నేతలు వ్యాపారాలను పక్కనపెట్టి ధర్మాన కోసం తెగించి పని చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ధర్మానకు గతంలో మద్దతిచ్చిన వర్గాలు దూరం !
కళింగ కోమట్లలోనూ అసంతృప్తి కళింగకోమట్లకు ఎన్నికల ముందు జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని టీడీపీ కళింగకోమటి నేత కోరాడ హరి గోపాల్ ధ్వజమెత్తడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కళింగకోమటి నేతలు సూరిబాబు, కోణార్క్ శ్రీనుల నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు విశాఖ మధురవాడలో జరిగిన ఒక సమావేశానికి ఉత్త రాంధ్ర ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారని తెలుసుకుని ఆయన ముందు తమ డిమాండ్లను ఉంచుదామని ఇక్కడి నుంచి బయలుదేరారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత సుబ్బారెడ్డి కళింగకోమట్ల సత్రం కోసం కొండపైన స్థలం ఇవ్వమని, కింద ఎక్కడో కట్టుకోండంటూ సెలవి చ్చారట. ఇక మిగిలిన డిమాండ్లు వినకుండానే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి వచ్చిన తరువాత మాట్లాడదామంటూ పంపించేశారని స్వయంగా కళింగకోమటి నేతలే చెబుతున్నారు. మార్కెట్లో పూర్తిగా ధర్మాన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి కారణాలను అన్వే షించకుండా కార్యవర్గాన్ని మార్చేద్దామన్న భావనకు కొందరు వచ్చారు. ప్రస్తుతం ఉన్నవారిని తీసేసి కొత్తగా హోల్సేల్ వర్తకుడు కోరాడ గోవింద్ (ప్రియా గోవింద్ కు పగ్గాలు అప్పగించాలని చూశారు. కానీ మార్కెట్లో కొత్త నాయకత్వం ఇప్పుడు ధర్మాన వెనుక వెళ్లేందుకు సిద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్నవారు పార్టీ మార కుండా ఉండడమే గొప్పన్న సంకేతాలు వెళ్లాయి. 2019లో ధర్మాన గెలిచిన తరువాత మంత్రి పదవి దక్కనంత వరకు ఆయన మీద ప్రజలకు సానుభూతి ఉండేది. ప్రస్తుతం అదీ కనిపించడం లేదు. ధర్మాన కూడా 2024లో గెలిచే పరిస్థితి లేదని భావించారో ఏమో అందరినీ దూరం పెడుతూ వస్తున్నారు. ఆయన వ్యవహారశైలిని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది.