CBI What Next : అందని ఫామ్ హౌస్ కేసు ఫైల్స్ - సీబీఐ వాట్ నెక్ట్స్ ?
తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఫామ్ హౌస్ కేసు వివరాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు సీబీఐ ఏం చేయబోతోంది ?
CBI What Next : మొయినా బాద్ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసులో సీబీఐ ఏకంగా ఐదు సార్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తమకు ఆ కేసు ఫైల్స్ అను అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. కానీ తెలంగాణ సీఎస్ మాత్రం స్పందించలేదు. మరో వైపు సుప్రీంకోర్టులో ఈ కేసు పదిహేడో తేదీన విచారణకు రానుంది. అప్పటి వరకూ సీబీఐ ఎదురు చూస్తుందా లేకపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసి రంగంలోకి దిగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
టెన్షన్‌లో నలుగురు ఎమ్మెల్యేలు !
ఫామ్ హౌస్ కేసులో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంకటస్థితి ఏర్పడింది. అసలే ఎన్నికల ఏడాది… అందులో సీబీఐ విచారణ.. పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది. బహిరంగంగా చెెప్పక పోయినా ఇటు నిందితులు, అటు పోలీసు ఉన్నతాధి కారుల బలవడం ఖాయమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వాస్తవాలు ఎలావున్నా ఆ పరిణామాలు ఎన్నికలపై ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసులో బీజేపీ తో సంబంధాలున్న డీల్ వీరులు ముగ్గుర్ని తెరపైకి తెచ్చి విచారిస్తే, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో నన్న ఆందోళన కనిపిస్తోంది.
అధికారుల్లోనూ టెన్షన్ !
సీబీఐకి వివరాలు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఈ విషయంలో సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కొత్త చీఫ్ సెక్రటరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే సమయంలో ఫామ్ హౌస్ కేసు సీబీఐ చేతికి వెళ్తే దరాబాద్, సైబరా బాద్ కమిష నర్లు కూడా ఇబ్బందులు న్యాయ పరమైన చిక్కుల్లో పడనున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు-గా చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టీఫెన్‌పై బీజేపీ నేతలు ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిట్‌కు నేతృ త్వం వహించిన సీవీ.ఆనంద్‌ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరూ ప్రభుత్వ పెద్దల వైపే చూస్తున్నారు.
సీబీఐ ఇప్పుడు ఏం చేయబోతోంది ?
నిజానికి ఈ కేసు సీబీఐకి చాలా రోజుల క్రితమే వచ్చింది. వెంటనే విచారణ ప్రారంభించవచ్చు. తెలంగాణ సర్కార్ అప్పీల్ కు వెళ్లిందని సీబీఐ దూకుడుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అదే సమయంలో తమకు కేసు వివరాలు, ఫైల్స్ ఇవ్వాలని పదే పదే చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తోంది. తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. ఈ కారణంగా కోర్టు ఆదేశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇది లాంఛనమే. కోర్టు ను కాదనే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. అయితే ఇది నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన కేసు కావడంతో.. తాత్సారం చేస్తున్నారు. సీబీఐ చేతికి కేసు వెళ్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని అంటున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతున్నారు. ఇప్పుడు సీబీఐ తెలంగాణతో సంబంధం లేకుండా.. ఢిల్లీలో కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ దిశగా సీబీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చేయాలనుకుంటే వెంటనే రంగంలోకి దిగుతుంది. సుప్రీంకోర్టులోనూ స్టే రాకపోతే.. ఆ తర్వాత సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎలా చూసినా ఈ కేసులో సీబీఐ ఒక్క సారి స్టెప్ ఇన్ అయిందంటే.. ఇక తర్వాత సంచలనాలు ఉంటాయన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.