Best Places for Sankranthi: ఫ్యామిలీతో సంక్రాంతి టైంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే - ఇక్కడో లుక్కేయండి
Best Places for Pongal 2025: సంక్రాంతికి ఎక్కడికి వెళ్లాలి, ఎలా స్పెండ్ చేయాలి అని అలోచిస్తున్నారా.. అలాంటి వారు ఈ ప్రదేశాలను తప్పక విజిట్ చేయండి.
Sankranthi Best Places: చూస్తుండగానే కాలం ఇట్టే గడిసిపోతోంది. కొత్త సంవత్సరం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో తెలుగు పండుగ సంక్రాంతి రానుంది. మరో వారంలో పిల్లలకు కూడా హాలిడేస్ వస్తాయి. చాలా మంది పండక్కి తమ ఫ్యామిలీతో గడపాలని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే ఉండి పండగను ఎంజాయ్ చేసే వాళ్లు కొందరైతే.. ఈ సమయంలో ఫ్యామిలీ ట్రిప్ ఇచ్చే కిక్కే వేరని ఫీలవుతూ ఉంటారు. అలాంటి వారు మరి ఈ సంక్రాంతి హాలిడేకి ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాల గురించి ఒక్కసారి తెలుసుకోండి. నచ్చితే మీరు ఈ హాలిడేస్ ట్రిప్ ప్లాన్ చేయండి. అయితే మరి ఈ ప్రదేశాలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తున్నారా.. మన తెలుగు వారందరికీ నచ్చే, మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక లేటెందుకు.. ఆ ప్లేసెస్ ఏంటో వెంటనే తెలుసుకుందాం.
భీమవరం
సంక్రాంతి అనగానే గాలి పటాలు, వాకిట్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, రేగుపళ్లు, కొత్త అల్లుడ్ల సరదాలు, కోళ్ల పందాలు, పశువులకు పూజలు.. ఇలా చెప్పాలంటే చాలానే ఉంటాయి. అయితే ఈ సంక్రాంతికి సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి భీమవరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల (కోళ్ల పందాలు) ఎంతో ప్రసిద్ధి చెందినవి. అంతే కాదు ఇక్కడ గాలి పటాల పోటీలు, స్థానిక వంటకాలు, ఇళ్ల ముందు రంగుల రంగుల ముగ్గులు బాగా ఆకట్టుకుంటాయి. పంటల పండుగ కావడంతో, వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే భీమవరంలో మతపరమైన, స్థానిక కథలతో మేళాలు, భిన్న నాటకాలను నిర్వహిస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నట్టయితే రోడ్డు మార్గం ద్వారా సుమారు ఎనిమిది గంటలలో భీమవరం చేరుకోవచ్చు. ఇక ఇక్కడ హోటల్ గ్రాండ్ లీలా కృష్ణ, ఫాల్కన్స్ నెస్ట్ హోటల్ వంటి హోటళ్లు బస చేసేందుకు చాలా అనువుగా ఉంటాయి.
సుబ్బయ్య గారి హోటల్‌లో తెలుగు భోజనం
మీరు ప్రామాణికమైన ఆంధ్రా వంటకాలను ఇష్టపడేవారైతే ఆల్-వెజిటేరియన్ హెవీ భోజనాన్ని కోరుకుంటే కూకట్‌పల్లిలోని సుబ్బయ్య గారి హోటల్‌కి వెళ్లండి. ఇక్కడ కాకినాడ కాజా, పునుగుల కూర, పూర్ణం బూరెలు, బూందీ, టొమాటో రైస్, పులావ్, పులిహోర, గుత్తి వంకాయ, గోంగూర, ఆవకాయ, పెరుగూ వడ, పాయసం వంటి కోస్తా ఆంధ్ర ప్రత్యేకతలతో అరటి ఆకుపై ఆహారం వడ్డిస్తారు. రెస్టారెంట్ కూడా చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. సిబ్బంది సైతం మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాస్తవానికి, ఇక్కడ భోజనం తినడం ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి భోజనంలో వడ్డించినట్టు 20 కంటే ఎక్కువ రకాలు వడ్డిస్తారు. ఇది హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉంది. మరికొన్ని చోట దీనికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి.
శిల్పారామంలో సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రతి సంవత్సరం, శిల్పారామంలో సంక్రాంతి సందడి కనిపిస్తుంది. సాధారణంగా ఈ ప్రదేశం గ్రామీణ పోకడలను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకించి సంక్రాంతికి ఇక్కడ స్థలం మరింత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. సాంప్రదాయ ఆభరణాలు, బట్టలు, అలంకరణలతో కూడిన సాధారణ షాపింగ్ స్టాల్స్‌తో పాటు, మీరు రంగోలి సామాగ్రి, గవ్వలు (పెంకులు), గోరింటాకు (మెహందీ) స్టాల్స్‌ను కూడా చూడొచ్చు . గంగిరెద్దు, పీతల దొరలు, హరికథ వంటి సంప్రదాయాలు కూడా శిల్పారామంలో ప్రదర్శనల ద్వారా వెలుగులోకి వస్తాయి.
కైట్ ఫెస్టివల్
ఏటా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణా టూరిజం మరియు ఇన్‌క్రెడిబుల్ ఇండియా నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడికి చాలా మంది చేరుకుని.. గాలిపటాలను ఎగురవేస్తారు. ఇక్కడ గాలిపటాల పోటీలను కూడా వీక్షించవచ్చు. ఒకవేళ మీకు అది బోర్ గా అనిపిస్తే.. అక్కడ నిర్వహించే క్రాఫ్ట్ మేళాను చూడొచ్చు. అదనంగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఏటా దేశం నలుమూలల నుండి చాలా మంది గాలిపటాల ఔత్సాహికులు తరలివస్తారు.
ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్
ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌తో పాటు, ఇంటర్నేషనల్ స్వీట్స్ ఫెస్టివల్ కూడా ఎంతో చెప్పుకోదగినది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ 40 కంటే ఎక్కువ డెజర్ట్‌లు ఉంటాయి. పూతరేకులు, కాజా, బొబ్బట్లు, గులాబ్ జామున్ వంటి ఇష్టమైన స్థానిక వంటకాలతో పాటు అంతర్జాతీయంగా రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు. మీరు కూడా ఈ పండక్కి స్వీట్ ఫెస్టివల్ లో భాగం కావాలనుకుంటే వెంటనే ప్లాన్ చేసుకోండి.