Telangana Elections 2023 : అడగకపోయినా కాంగ్రెస్‌కే మద్దతు - షర్మిల వ్యూహం వెనుక ఏపీ రాజకీయాలు ఉన్నాయా ?
ఎవరూ అడగకపోయినా షర్మిల కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతు పలికారు. ఏపీ రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా ?
Telangana Elections 2023 : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీఆర్ఎస్ ను ఓడించడానికే కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తున్నట్లుగా ప్రకటించారు. షర్మిలను మద్దతివ్వాలని ఏ కాంగ్రెస్ నాయకుడు అడగలేదు. అటు ఢిల్లీ నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా ఎవరూ పోటీ నుంచి విరమించుకుని తమ పార్టీకి మద్దతివ్వాలని షర్మిలను అడగలేదు. పైగా విలీన ప్రతిపాదనపై ఏమీ చెప్పకుండా షర్మిలను పక్కన పెట్టేశారు. ఈ కోపంతో తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ చివరికి వచ్చే సరికి తను కూడా పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.
కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్లుగా రాహుల్‌కు లేఖ
తాను కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించానని రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా ఓ లేఖ కూడా రాసి గుర్తు చేశారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నాం.బీఆర్ఎస్ ను ఓడించి సరికొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ టీపీ పోటీ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతినే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. దాంతో ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని ఎన్నికల నుంచి తప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలి. మా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విజయం కోసం కృషిచేస్తారని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీకి శ్రేణులు ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఇలా వెంటపడి మద్దతు ప్రకటించడం వెనుక షర్మిల వ్యూహం వేరే ఉందని..గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొన్నటి వరకూ సోనియాపై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పార్టీ వల్ల వైఎస్ ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత వైఎస్ ఫ్యామిలీ మొత్తం ...సోనియా గాంధీని నిందించడం ప్రారంభించారు. చాలా సార్లు వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక సోనియా ఉన్నారని ఆరోపించారు. అలా ఆరోపించిన వారిలో విజయమ్మ, షర్మిల ముందు ఉంటారు. అంత తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు.. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ వెనుక వెళ్లాలనుకోవడానికి బలమైన కారణం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఉపయోగం ఉండదని తెలిసీ తెలంగాణలో పార్టీ ఎందుకు ?
షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పుడు ఎవరూ నమ్మలేదు. షర్మిల ఏంటి.. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం ఏమిటని అందరూ అనుకున్నారు. ఎందకంటే.. షర్మిల రాజకీయం చేయాలనుకుంటే.. ఆంధ్రప్రజలు ఆదరిస్తారు కానీ.. తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆ విషయం రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వారెవరైనా అంగీకరిస్తారు. మరి షర్మిలకు మాత్రం తెలియకుండా ఉంటుందా ?. అయినా షర్మిల పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేశారు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించారు. మొదట్లో హైకమాండ్ ఆసక్తి చూపినా తర్వాత వద్దనుకున్నారు. అయినా కాంగ్రెస్ కే మద్దతు పలికారు. షర్మిల వ్యూహం ప్రకారం పార్టీ పెట్టి కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలనుకున్నాని.. ఆ దిశగానే అడుగేశారని చెబుతున్నారు.
భవిష్యత్ రాజకీయాల కోమేనా ?
జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఎవరికి ఉంటుందో అంచనా వేయడం కష్టం. కానీ... ముందుగా ఓ రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకోవడం మాత్రం రాజకీయాల్లో కీలకం. వైఎస్ జగన్, షర్మిల భిన్నమైన దారుల్లో కలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని .. అందుకే కాంగ్రె్స పార్టీకి ఒకరు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా షర్మిల ప్లాన్ మాత్రం.. ఏపీ రాజకీయాలతో ముడిపడి ఉందని గట్టిగా నమ్ముతున్నారు