Komatireddy Revant reddy : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి దోస్తానా ! టీ కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్లేనా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి తమ మధ్య రాజకీయ విబేధాలను పరిష్కరించుకున్నారు. కలసి పని చేస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పుగా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ( Revant Reddy ) , కోమటిరెడ్డి కలిసిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. కోమటిరెడ్డి ( Komatireddy ) కూడా రేవంత్ ను సాదరంగా ఆహ్వానించారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించామని, భవిష్యత్ లో ఏం చేయాలనేదానిపై కూడా చర్చించామని ప్రకటించారు. తెలంగాణ లో ( Telangana) నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాటాలు చేస్తుందన్నారు.
కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ప్రశంసలు వర్షం కురిపించారు. అందరూ పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేశారన్నారు. భవిష్యత్ కార్యచరణ పై ఇద్దరం చర్చించామన్నారు. తాము చర్చించిన అంశాలను పార్టీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ దేశ సమైక్యత కోసం కృషి చేసిన గాంధీ కుటుంబం గురించి అస్సాం ( Assam CM ) బీజేపీ ముఖ్యమంత్రి అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోడీ కోవర్ట్ అని, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలను చీల్చేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలతోనే కేసీఆర్ ( KCR ) ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రంట్ పేరుతో టెంట్ వేసి.. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని ఇద్దరు నేతలు ఆరోపించారు.
Happy times…. pic.twitter.com/kWBspwDdBA
— Revanth Reddy (@revanth_anumula) February 15, 2022
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ప్రకటించిన తర్వాత కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులతో కొన్నారని విమర్శించారు. పదవి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్ నేతలందరితోనూ సమావేశమయ్యేందుకు వారి ఇళ్లకే వెళ్లారు. అలాగే కోమటిరెడ్డి ఇంటికి వెళ్లాలని ప్రయత్నించారు., పలుమార్లు సంప్రదించారు.కానీ కోమటిరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం తనకు ఇష్టం లేదని మొహం మీదనే చెప్పారు. తన ఇంటికి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. అప్పట్నుంచి రేవంత్ రెడ్డిపై పలు సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో దళిత, గిరిజన దంోరా నిర్వహించడానికి కూడా అంగీకరంచలేదు.
అయితే ఇటీవల వారు మళ్లీ కలసి మాట్లాడుకోవడం ప్రారంభించారు. రాహుల్ గాంధీతో ( Rahul Gandhi ) ఓ సమావేశంలో కలసి పాల్గొన్నారు. ఇప్పుడు వారి మధ్య సఖ్యత ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఎంపీలుగా కలిసి పోరాటాలు చేస్తున్నారు. మూడు రోజుల కిందట కేసీఆర్ యాదాద్రి జిల్లాలో పర్యటించినప్పుడు కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆయన కాస్త చనువుగా ఉండటం చర్చనీయాంశమయింది. ఆ తర్వాత గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్‌కు కోమటిరెడ్డిపై ఫిర్యాదులు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అలాంటి విబేధాలన్నింటినీ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పరిష్కరించుకున్నట్లయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.