Political Language: తెలంగాణ రాజకీయాల్లో దిగజారిపోతున్న భాష - ఒకరిని మించి ఒకరు - మార్పు ఎప్పటికి?
Telangana: తెలంగాణలో తిట్టుకోవడమే రాజకీయం అన్నట్లుగా మారిపోయింది. రేవంత్, కేటీఆర్ లతో పాటు ఇప్పుడు కింది స్థాయి నేతలు కూడా అదే భాషకు మారిపోతున్నారు.

Telangana Political Language : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అభివృద్ధి కంటే అసభ్యత ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజాప్రతినిధులు ఉండాల్సిన హుందాతనాన్ని పక్కన పెట్టి, వీధి స్థాయి మాటలతో పరస్పర విమర్శలకు దిగడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న ఈ భాషా యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది.
తెలంగాణ రాజకీయంలో బూతుల పర్వం
తెలంగాణ గడ్డపై రాజకీయాలు ఎప్పుడూ వేడిగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో నాయకులు వాడుతున్న భాష మాత్రం సరిహద్దులు దాటుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య సాగుతున్న వ్యక్తిగత దూషణలు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ కేటీఆర్ అనే స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నిసార్లు ఉరి తీసినా పాపం లేదని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలి. మళ్లీ వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టిస్తాం అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించడం తెలంగాణ రాజకీయాల్లో స్థాయి ఎంతగా దిగజారిందో తెలియజేస్తోంది.
సభలోనూ అసభ్య పదజాలం
కేవలం బయట సభల్లోనే కాకుండా, పవిత్రమైన అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తే చూస్తూ ఊరుకోం.. మీ నాలుకలు కోస్తాం" అని సీఎం అనడం సంచలనం సృష్టించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి, శాసనసభ రికార్డుల్లో ఉండేలా ఇటువంటి పరుష పదజాలాన్ని వాడటం ఏమాత్రం సమంజసం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి అత్యంత అసభ్యకరమైన పద ప్రయోగం చేశారని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది.
రాజకీయాల్లో పిహెచ్‌డీ ల స్థాయి తిట్లు
నాయిని రాజేందర్ రెడ్డి వంటి నేతలు మాట్లాడుతూ.. మాకు తిట్టడంలో పీహెచ్‌డీలు ఉన్నాయి, మేము మొదలు పెడితే మీరు తల దాచుకోవడానికి చోటు ఉండదు అని అనడం గమనిస్తే, రాజకీయాల్లో మేధోపరమైన చర్చ కంటే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత పెరిగిందని అర్థమవుతోంది. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ చదువుకున్న వారు, ప్రపంచ జ్ఞానం ఉన్న వారు అయినప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేసే క్రమంలో వాడుతున్న పదజాలం యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో భాష ఒక ఆయుధంగా ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం ప్రత్యర్థులను కించపరిచే సాధనంగా మారింది. ప్రజల సమస్యల కంటే, ఎవరు ఎవరిని ఎంత ఎక్కువగా తిట్టారనే దానిపైనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో సామాన్య ప్రజలు ప్రజాప్రతినిధులపై గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నాయకులు ఆత్మపరిశీలన చేసుకుని, భాషా హుందాతనాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





















