(Source: ECI/ABP News/ABP Majha)
Vasupalli Resign : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ షాక్ - సమన్వయకర్త పదవికి వాసుపల్లి రాజీనామా
వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. వైవీ సుబ్బారెడ్డి పర్యటనలో తనకు అన్యాయం జరిగిందని ఆయన చెబుతున్నారు.
Vasupalli Resign : విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు విశాఖకు వైఎస్ఆర్‌సీపీ తరపున ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో తన నేపధ్యం గురించి.. తన సామాజికవర్గం గురించి.. తాను రాజకీయాల్లో ఎలా ఎదిగింది .. వివరించారు. చివరికి జగన్ పాలన మెచ్చి తాను వైఎస్ఆర్‌సీపీలో చేరానని కానీ తను పార్టీలో నిరాదరణ ఎదురవుతోందన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తగా వైవీ సుబ్బారెడ్డి విశాఖకు వచ్చిన రోజే తనకు శల్య పరీక్ష పెట్టారని .. ఆ రోజు జరిగిన పంచాయతీ వల్ల తన గౌరవానికి భంగం కలిగిందన్నారు. అందుకే స్వయంగా తన సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వైవీ సుబ్బారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి బద్దుడైన నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడతానని లేఖలో తెలిపారు. నిజానికి వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన అధికారికంగా వైఎస్ఆర్‌సీపీలో చేరలేదు. ఆయన కుమారులను మాత్రం ఆ పార్టీలో చేర్పించారు. తాను మాత్రం ఎమ్మెల్యే హోదాలో ఇంచార్జ్‌గా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే ప్రాంతీయ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను పక్కన పెట్టారు. ఇతర నేతలను ప్రోత్సహించడం ప్రారంభించారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ నేతృత్వంలో ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు భరోసా ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. సీతంరాజు సుధాకర్ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ నియోజకవర్గంలో తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాసుపల్లి ఇటీవల తన అసంతృప్తిని మీడియా ముందు బహిరంగంగా వ్యక్తంచేశారు. పార్టీలో కొంతమంది నేతలు కావాలనే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయనపైనా ప్రత్యర్థి వర్గం విరుచుకుపడింది.
ఈ పరిస్థితుల్లో సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వైవీ సుబ్బారెడ్డికి వాసుపల్లి లేఖ రాశారు. కానీ పార్టీ అభివృద్ధికి పాల్పడతానని చెప్పడంతో ఆయన ఇంకా తనకు ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశతో ఉన్నట్లుగా తెలుస్తోంది. లేఖలో తన సామాజికవర్గం గురించి ప్రత్యేకంగాప్ర స్తావించడంతో బీసీ కోటాలో అయినా తనకు చాన్స్ ఇస్తారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాసుపల్లి రాజీనామా అంశంపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ స్పందించలేదు.