BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Andhra : బీసీ రక్షణ చట్టం కోసం టీడీపీ పక్కా ప్రణాళికతో వెళ్తోంది. ఈ చట్టం ద్వారా బీసీ వర్గాల అభిమానాన్ని పూర్తి స్థాయిలో పొందేలా ప్లాన్ చేసుకుంటోంది.
Andhra BC Atrocities Act : పరిపాలన ప్రజల్ని మెప్పించేలా చేయగలిగితే మళ్లీ మళ్లీ ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రజాస్వామ్య రాజకీయంలో ఇది మొదటి సూక్తి. మరి ఐదేళ్ల పాలనలో ప్రజల్ని మెప్పించడం సాధ్యమేనా అంటే కష్టమే కానీ అసాధ్యం కాదని చాలా సార్లు ప్రభుత్వాలకు కంటిన్యూటీ ఇచ్చి ప్రజలు నిరూపించారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ప్రజల్ని సంతృప్తి పరిచేలా పాలన సాగించడం అంత తేలిక కాదు. అదే సమయంలో వారి మనసులో ఆశల్ని, ఆకాంక్షల్ని కనిపెట్టగలిగితే పెద్ద కష్టమేం కాదు. ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వివిధ వర్గాల్లో ఉన్న ఆశల్ని తీర్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తేవాలని నిర్ణయించుకుంది.
వేధింపులకు గురవుతున్నామని బీసీ వర్గాల్లో ఆవేదన
ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కోసం ప్రత్యేకంగా అట్రాసిటీస్ చట్టం ఉంది. వారిని కులం పేరుతో పిలిచినా నేరమే. అయితే బీసీల్లోనూ కొన్ని కులాలు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నాయి. కొన్ని కులాలు తమను ఎస్సీల్లో చేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల వ్యవహారం పక్కన పెడితే కులం కారణంగా తమపై వివక్ష చూపే వారు.. వేధింపులకు గురి చేసేవారు కూడా ఉండటంతో తమకు కూడా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టం ఉండాలన్న భావన వారిలో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బీసీలపై ఘోరమైన దాడులు జరిగాయని టీడీపీ ఆరోపించింది. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడి దగ్గర నుంచి ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనే నేత వరకూ అనేక మందిని దారుణంగా చంపేశారని టీడీపీ ప్రకటించింది. అదే సమయంలో వందల కుటుంబాల ఆస్తులు లాక్కున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
సజ్జలకు మద్దతుగా నోరెత్తని వైసీపీ ముఖ్య నేతలు - ఒంటరి అయ్యారా ?
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని టీడీపీ హామీ
బీసీలపై వరుసగా జరుగుతున్న దాడులు, వారిపై పెరుగుతున్న వివక్ష, సమాజంలో వారు పెరగకుండా చేస్తున్న అంశాలను నిరోధించేందుకు టీడీపీ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలనూ పెట్టి ఈ మేరకు విస్తృత ప్రచారం చేసింది. అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై ఎనిమిది మంది మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. కులపరంగా, వ్యక్తిగతంగా దూషించినప్పుడు చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించనున్నారు. బీసీ చట్టం రూప కల్పనలో న్యాయ నిపుణులు, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఏపీలో అమలు చేయబోయే బీసీ రక్షణ చట్టం దేశంలోనే తొలిసారి అవుతుంది.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
చట్టం అమల్లోకి వస్తే టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి బీసీ వర్గాల్లో అత్యధికం తెలుగుదేశం పార్టీకి మద్దతు దారులుగా ఉన్నారు. వారి కోసం ఆ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు బీసీ రక్షణ చట్టం ద్వారా మరో బెంచ్ మార్క్ బీసీ సంక్షేమాన్ని చూపించాలని అనుకుంటున్నారు. దీని వల్ల బీసీలు తెలుగుదేశం పార్టీకి మరింత బలమైన మద్దతు దారులుగా మారుతారని.. భవిష్యత్‌లో తిరుగు ఉండదని అంచనా వేస్తున్నారు. ఆ చట్టం వల్ల బీసీలు వివక్షకు గురి కావడం ఆగిపోతే.. వారు నిజంగానే టీడీపీపై మరింత కాలం ఆదరాభిమానాలు చూపించే అవకాశం ఉంది.