YSRCP Steelplant Fix: వైఎస్ఆర్‌సీపీ బలహీనతే టీడీపీ ఆయుధం - వైజాగ్ స్టీల్‌పై మాట్లాడకుండా పక్కాగా ఫిక్స్ చేసేసిన అధికార పార్టీ !
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇక వైసీపీ మాట్లాడలేని పరిస్థితిని టీడీపీ సృష్టించింది. వైసీపీ బలహీనతను ఆసరాగా చేసుకుని ఫిక్స్ చేసేసింది.

TDP fixed YCP in Vizag Steel Plant Issue: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలిలో అధికార పార్టీ తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి వైఎస్ఆర్‌సీపీ మద్దతు పలికింది. ఇలా అనడం కన్నా మద్దతు పలకాల్సిన పరిస్థితిని తెలుగుదశం పార్టీ సృష్టించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు, ప్రకటనలు చేయలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీ ఉంది. అందుకే ఈ తీర్మానాన్ని వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం లభించేలా చేశారు. దీని వల్ల వైఎస్ఆర్‌సీపీ రాజకీయంగా ఓ మంచి ఆయుధాన్ని కోల్పోయింది. భవిష్యత్ లో ఎప్పుడూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై విమర్శలు చేయలేదు.
స్టీల్ ప్లాంట్ ఓ కీలక రాజకీయ అంశం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీలో కీలక రాజకీయ అంశం. స్టీల్ ప్లాంట్ ను గతంలో కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంది. గత ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో... ఎన్డీఏలో నెంబర్ 2గా ఉన్న టీడీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని స్పష్టం చేసింది. టీడీపీ డిమాండ్ కారణంగా ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గింది. భారీగా ఆర్థిక సాయం ప్రకటించి ప్లాంట్ ను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. కానీ కార్మికుల్లో, ఇతర రాజకీయ పార్టీల్లో మాత్రం సందేహాలు అలాగే ఉన్నాయి.
ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారన్న అనుమానాలు
స్టీల్ ప్లాంట్ లో ఖర్చులు తగ్గించుకునేందుకు సిబ్బందిని తగ్గించడంతో పాటు వివిధ రకాల పొదుపు చర్యలు తీసుకుంటున్నారు. పలు విభాగాల్లో ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటీకరణ సంకేతాలేనని కాంగ్రెస్, వైసీపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. మండలిలలో ప్రైవేటీకరణ చేయనందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని వైసీపీ పక్ష నేతగా సమర్థించిన బొత్స సత్యనారాయణ కూాడా ప్రైవేటీకరణ జరుగుతోందని అంటున్నారు. ఇటీవల ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అలాంటి నేతకు శాసనమండలిలో తీర్మానానికి మద్దతివ్వాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు మండలిలో ప్రైవేటీకరణ జరగదని.. సంతోషం వ్యక్తం చేసి తీర్మానానికి మద్దతిచ్చి బయట ప్రైవేటీకరణ జరుగుతోందని రాజకీయం చేస్తే.. అందరూ ఆయన విశ్వసనీయతను ప్రశ్నిస్తారు.
కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకించే స్థితిలో లేని వైసీపీ
వైసీపీ అధినేత జగన్.. ఢిల్లీలో ఎన్డీఏకే బాసటగా ఉండాలనుకుంటున్నారు. ఏ బిల్లు పెట్టిన తనకు ఉన్న బలం మేరకు వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. రాష్ట్రంలో బీజేపీని ఏ మాత్రం విమర్శించడం లేదు. ఏపీలో ఉన్న ఎన్డీఏ కాని టీడీపీ అని..టీడీపీనే విమర్శిద్దామని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే పిలుపునిచ్చారు. బీజేపీతో ఉన్న అవసరాలు, ఆ పార్టీని ధిక్కరిస్తే తనపై ఉన్న కేసుల అంశం ఊపందుకుంటుందన్న భయంతోనే జగన్ కేంద్రానికి మద్దతిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. జగన్ ఉన్న పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్న టీడీపీ.. కేంద్రానికి ధన్యవాదాల తీర్మానం పెట్టి.. బొత్సతోనే మద్దతు ఇచ్చేలా చేసుకున్నారు.
ఇకపై స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయం చేసే అర్హతను వైసీపీ కోల్పోయినట్లయింది. బీజేపీని వ్యతిరేకించలేకపోతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ విధానాన్ని టీడీపీ అడ్వాంటేంజ్ గా తీసుకుని.. రాజకీయంగా నిర్వీర్యం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















