Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
Uppada fishermen issues: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Andhra Pradesh News Today | అమరావతి: ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చర్యలు చేపట్టారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేశారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
వ్యక్తిగతంగా వచ్చి చర్చించలేకపోతున్నాను..
‘ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధి మీద ప్రతికూల ప్రభావం గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల ఆందోళనలు, వారి సమస్యలు నా (పవన్ కళ్యాణ్) దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రభావంతో మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాలు (AP Assembly Sessions) కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో నిరంతరం చర్చిస్తున్నాను. మత్స్యకారులు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని కమిటీని ఆదేశించాను.
మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు
కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నేతలకు స్థానం ఇవ్వాలని నిర్ణయించాం. సమస్యల పరిష్కారంతోపాటు ఉప్పాడ మత్స్యకారు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ ఫోకస్ చేయనుంది. మత్స్యకారులకు నష్ట పరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయాల్సిన సిఫారసులతో కూడిన నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.

ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇదివరకే గుర్తించడమైనది. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపుపై అధికారులతో చర్చించాను. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించా. తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా దృష్టి సారించాలని స్పష్టం చేశాను. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురుచూడకుండా ప్రాధాన్యత ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని తెలిపాను.
అసెంబ్లీ సమావేశాల తరువాత మత్స్యకారులతో సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు, ఇతర వర్గాల కష్టపడే వర్గాల వారికి భరోసా కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై చర్చిస్తాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






















