TDP Candidates : దసరాకే టీడీపీ అభ్యర్థుల జాబితా - చంద్రబాబు పాత అలవాటు వదిలేశారా ?
దసరాకు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వరుసగా ఇంచార్జులను ప్రకటిస్తున్నారు.
TDP Candidates : తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఎంపిక అనే ప్రక్రియ నామినేషన్ల వరకూ ఉంటుంది . పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అయితే నామినేషన్ల ఉపసంహరణ వరకూ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఒత్తిడి తెస్తే వారికి చాన్సిస్తారు. అలాంటి రాజకీయం వల్ల.. చివరి క్షణంలో నేతలు రెబల్స్ గా మారుతూ పార్టీకి నష్టం చేస్తున్నారు. అయితే అదే సాగింది. ఈ సారి మాత్రం చంద్రబాబు ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఇంచార్జులుగా ప్రకటిస్తూ..వారే అభ్యర్థులన్న సంకేతాలు పంపుతున్నారు.
సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న చంద్రబాబు
సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మినారాయణను ఇంచార్జ్ గా నియమించారు. నెల్లూరు సిటీకి పొంగూరు నారాయణను ప్రకటించారు. పోటీ ఉన్న ఇతర నియోజకవర్గాలకు కూడా ఇంచార్జులను ప్రకటిస్తూ పోతున్నారు. నియోజకవర్గాల్లో పరిస్ధితులను ఆయన స్వయంగా తెలుసుకుంటూ గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో మాదిరిగా ఎటువంటి ఒత్తిళ్ళు , ఇతర అంశాలు ప్రభావితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఇదే అంశాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పని తీరు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని ఎటువంటి ఒత్తిడికి లొంగేది లేదని తేల్చి చెబుతున్నారు.
గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక !
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుగానే అభ్యర్దులను ప్రకటించే యోచనలో ఉన్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఆ మేరకు కసరత్తును మొదలు పెట్టింది. గతంలో చేసిన సర్వే నివేదికలు, పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన సమాచారం, ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగా అభ్యర్దుల కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో స్దానిక ప్రజల నాడీ, క్యాడర్‌కు అనుగుణంగా ఉన్న నేతలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఈ మేరకు మార్పులు, చేర్పులు చేసిన అధిష్టానం ఇప్పుడు తాజాగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలను తయారు చేస్తోంది.పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు సంస్ధాగత ప్రక్షాళన అవసరమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలమైన అభ్యర్దులను రంగంలోకి దింపి సత్తా చాటాలన్న యోచన లో ఆ పార్టీ అధినేత ఉన్నారు.
దసరాకు అభ్యర్థుల ప్రకటన
అసెంబ్లీ ,పార్లమెంటు అభ్యర్ధులను దసరా నాటికి దాదాపు ఖరారు చేయాలన్న నిర్ణయానికి టీడీపీ అధిష్టానం వచ్చింది. ఎన్నికల ప్రధాన మ్యానిఫెస్టోతో పాటు 80 మంది అభ్యర్దులను ప్రకటించాలన్న భావనలో ఆ పార్టీ ఉంది. నియోజకవర్గాలలో నేతలు ముందస్తుగానే పని చేస్తే గెలుపు తధ్యమన్న దీమాలో ఉన్న అధినాయకత్వం ఈ క్రమంలోనే అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఈ లోగా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం , నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక, అంగబలం ఉన్న నేతలతో పాటు కొత్త వారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించనున్నారు. అనేక మంది సీనియర్లకు ఈ సారి చంద్రబాబు టిక్కెట్ నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. నలభై శాతం యువతకు టిక్కెట్లిస్తారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial