(Source: ECI/ABP News/ABP Majha)
TTDP Committees: తెలంగాణలో టీడీపీ కమిటీలు రద్దు - స్థానిక నేతలకు అధినేత చంద్రబాబు కీలక ఆదేశాలు
Telangana News: తెలంగాణలో అన్ని టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రద్దు చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలకు కీలక ఆదేశాలిచ్చారు.
Chandrababu Cancelled TTDP Committees: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అన్ని టీడీపీ (TTDP) కమిటీలను రద్దు చేశారు. పార్టీ సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని స్థానిక నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీని క్షేతస్థాయిలో బలోపేతం చేయాలని.. పెద్దఎత్తున సభ్యత్వాలు చేసిన నేతలకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని అన్నారు.
తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని.. రెండు ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలనేదే తన అభిమతమని చంద్రబాబు చెప్పారు. కొందరు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న క్రమంలో పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతం చేయాలని నిర్దేశించారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేతలు చూడాలని.. పని తీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'యువతకు అధిక ప్రాధాన్యం'
తెలుగు ప్రజలు గత 45 ఏళ్లుగా తనను ఆశీర్వదిస్తూ వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వారిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని అన్నారు. ఆన్ లైన్‌లో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. తనపై రెండు బాధ్యతలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం సహా రాక్షస పాలన అంతమొందించి రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగాలని తనను గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయడం ఈ రెండు ప్రధాన బాధ్యతలని చెప్పారు. నెలలో రెండుసార్లు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని.. అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని అన్నారు. అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు.
ఫుల్ జోష్‌తో..
ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ జోష్‌లో ఉంది. అటు, కేంద్రంలోనూ బలమైన పార్టీగా నిలిచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇకపై ప్రతి నెలలో రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని ఆయన నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో టీడీపీ పేరే వినిపించడం కష్టంగా మారింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ పార్టీకి పునఃవైభవం తెచ్చేలా అధినేత పావులు కదుపుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లోనైనా లేక సొంతంగా అయినా లేదా వేరే పార్టీతో పొత్తుతో ద్వారా కొన్ని సీట్లైనా సాధించి పార్టీని తిరిగి నిలబెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతైనా ప్రభావం చూపించాలని భావిస్తున్నారు.