ధర్మవరంలో పరిటాల Vs చిలకం-టిక్కెట్ దక్కేదెవరికో?
రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తే.. శ్రీరామ్ కు ధర్మవరం టిక్కెట్ డౌట్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక టిక్కెట్. టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం కే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట.
అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు మిత్రుల మధ్యే విభేదాలు సృష్టించబోతోందా? పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఎవరికి దక్కబోతోంది ? ఏ పార్టీ ఈ నియోజకవర్గాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ? ఇంతకీ ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ బలంగా ఉందా లేదంటే విపక్షమా ?
ఏపీలో విపక్షాలన్నీ ఒక్కటై ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అయితే ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఇంకా తేలలేదు. టిడిపి -బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగుతుందా లేదంటే పచ్చపార్టీతో కలిసి ముందుకెళ్తుందా అన్నది ఇంకా పవన్ కల్యాణ్ తేల్చలేదు. అటు బీజేపీ కూడా జనసేనతో కలిసి ఉంటామని చెబుతున్నా కానీ ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఆ నియోజవర్గంలో సీటు కోసం ఇటు టిడిపి అటు జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరికి రానున్న ఎన్నికల్లో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నియోకవర్గం ఏంటంటే ధర్మవరం.
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఇప్పుడు టిడిపి-జనసేనల మధ్య చిచ్చుపెట్టబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని టిడిపి నేత ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ భావిస్తున్నారు. చంద్రబాబు సూచనల మేరకు ధర్మవరం ఇంఛార్జ్ గా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సీటు తనకివ్వాలని ఇప్పటికే తల్లి పరిటాల సునీత ద్వారా చంద్రబాబుకి విన్నవించారట. అయితే టిడిపి అధినేత మాత్రం మౌనంగా ఉన్నారట. అందుకు కారణం గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఓటమిపాలవ్వడమే. అంతేకాదు శ్రీరామ్ స్థానంలో పరిటాల సునీతను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలను సునీత చూసుకుంటారు. అక్కడి నుంచే ఆమెని బరిలోకి దింపాలన్నది చంద్రబాబు వ్యూహమట. అంతేకాదు కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్ ఇవ్వాలని టిడిపి అధ్యక్షుడు ఇప్పటికే నిర్ణయించారట. అందుకే పరిటాల సునీత వైపే ఆయన మొగ్గు చూపుతున్నారట. అయితే సునీత మాత్రం తన కొడుక్కే మళ్లీ పోటీ చేసే అవకాశమివ్వాలని చంద్రబాబుకి మొరపెట్టుకున్నారట.
జనసేన పార్టీ కూడా ఈనియోజకవర్గంలో బలపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదనరెడ్డికి ప్రజల్లో మంచి పేరే ఉంది. అధికారపార్టీతో ఢీ కొట్టే నేతగా చిలకం పేరు తరచూ వినిపిస్తుంటుంది. పవన్ కల్యాణ్‌కి కూడా ఈయనపై మంచి అభిప్రాయమే ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చిలకం ధర్మవరం నుంచి పోటీ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి- జనసేన పొత్తు ఖరారైతే ధర్మవరం నుంచి పరిటాలకి అవకాశం ఉంటుందా లేదంటే చిలకం ఛాన్స్ కొట్టేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా ఇంకొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ధర్మవరం అధికారపార్టీనేతగా కేతిరెడ్డి ఉన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేతిరెడ్డిని ఓడించే నేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పరిటాల శ్రీరామ్‌కి టికెట్ అంత ఈజీ కాదనీ, టిడిపి - జనసేన పొత్తు వుంటే చిలకం మధుసూదన్‌రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నియోజకవర్గంలో టాక్.