Ration Card Credit Politics: రేషన్ కార్డులపై ఫొటో రాజకీయం - బియ్యం ఇచ్చేది ఎవరు? మైలేజ్ కోరేది ఎవరు?
Credit Politics: రేషన్ కార్డుపై ఫోటో కోసం తెలంగాణలో రాజకీయాలు జరుగుతున్నాయి. మోదీ ఫోటో వేయకపోతే సొంతంగా పంపిణీ చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Smart Ration Card Modi Photo Controversy: తెలంగాణలో కొత్తగా పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించడం లేదంటూ కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద నిధులను, సబ్సిడీ బియ్యాన్ని సమకూరుస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు మాత్రమే ప్రింట్ చేయడం రాజకీయ కుట్రేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఒకవేళ మోదీ ఫొటో పెట్టకపోతే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కేంద్రమే నేరుగా డోర్ డెలివరీ పంపిణీ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కొత్త నిప్పు రాజేశాయి.
అసలు బియ్యం ఇస్తోంది నిజంగా కేంద్రమేనా?
రాజ్యాంగపరంగా , ఆర్థికపరంగా చూస్తే కేంద్రం బియ్యం ఇస్తోందా అంటే దానికి అనేక లెక్కలు ఉంటాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం , PMGKAY కింద ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే సాధారణ బియ్యానికి కిలోకు దాదాపు 35 నుండి 40 రూపాయల వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే నేరుగా భరిస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రం ఇచ్చే బియ్యం పంపిణీకే పరిమితం కాకుండా, లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి సొంత నిధులతో అదనపు కోటాను కొనుగోలు చేస్తోంది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని తన బడ్జెట్ నుంచే చెల్లిస్తోందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు .
సవాలు – ప్రతిసవాలు
కేంద్రం సన్నబియ్యానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరిస్తే స్మార్ట్ కార్డులపై మోదీ ఫొటో ప్రింట్ చేసేందుకు మాకేమీ అభ్యంతరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయగా, రూ.15,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చే కేంద్రానికి కనీస ప్రాతినిధ్యం ఇవ్వరా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. చట్టపరమైన , సమాఖ్య స్ఫూర్తి దృష్ట్యా చూస్తే.. సంక్షేమ పథకాలపై నేతల ఫొటోలు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా వసతోంది. రాజ్యాంగ నిబంధనలు, కేంద్ర ఆహార భద్రతా చట్టాల ప్రకారం రేషన్ కార్డు అనేది లబ్ధిదారుని గుర్తింపు, ఆహార హక్కుకు సంబంధించిన అధికారిక పత్రం మాత్రమే తప్ప, అది ఏ ఒక్క పార్టీ ప్రచార పత్రం కాదు. గతంలో కేంద్రంలో లేదా వివిధ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల్లో పొందే రాజకీయ మైలేజ్ కోసం నేతల చిత్రాలను ప్రజాధనంతో ముద్రించడం అనవసరమైన ఆనవాయితీగా మారింది.
క్రెడిట్ వార్ లో గెలుపెవరిది?
భారతదేశంలో రేషన్ సబ్సిడీ అనేది నేరుగా ఓటర్లను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సాధనం. ఈ బియ్యం వెనుక ఉన్నది ప్రధాని మోదీనే అనే భావన గ్రామీణ కేడర్కు, లబ్ధిదారులకు వెళ్తే కేంద్రంలో ఉన్న బీజేపీకి మైలేజ్ లభిస్తుంది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోషన్ పొందితే, కాంగ్రెస్ తన గ్యారెంటీలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తోందనే పేరు తెచ్చుకుంటుంది. అందుకే ఇరు పార్టీలు ఫొటోల వద్ద రాజీపడటం లేదు. మహిళా సంఘాల ద్వారా నేరుగా పంపిణీ అనే కిషన్ రెడ్డి ఆలోచన ఆచరణలో చాలా కష్టం. రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది నెట్వర్క్, డీలర్లు, రవాణా, లబ్ధిదారుల సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుంది. కేంద్రం సమాంతర వ్యవస్థను నడపడం అనేది కేంద్ర-రాష్ట్రాల మధ్య పెను రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందే తప్ప, సులువుగా అమలు చేయగలిగేది కాదు.
ప్రజాధనంతో ఇచ్చే సంక్షేమ ఫలాలపై ఫొటోల కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు సాక్ష్యంగా కనిపిస్తోంది. కేంద్రం ఇచ్చే బియ్యం సబ్సిడీని, రాష్ట్రం భరించే సన్నబియ్యం వ్యయాన్ని పక్కనబెట్టి.. లబ్ధిదారుడికి నాణ్యమైన ఆహార ధాన్యాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనేదాని కంటే, కార్డుపై ఎవరి ముఖం ఉందనేదే రాజకీయ ప్రాధాన్యతగా మారడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకరమైన పరిణామం అని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















