TDP News: సింగనమల టీడీపీలో ఏం జరుగుతోంది? బండారు శ్రావణిపై వ్యతిరేకత ఎందుకు!
Andhra Pradesh News: ఎప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా.. గెలిపిస్తామన్న ధీమా పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. కానీ బండారు శ్రావణి విధానాలు పార్టీకి తలనొప్పిగా మారాయా అంటే.. అవునని వినిపిస్తోంది.
TDP leader Bandaru Sravani: అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. సింగనమలలో నెగ్గాలని టీడీపీ ఫోకస్ చేస్తోంది. ఎందుకంటే.. అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచారంటే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో చేపట్టినట్టే. ఎప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా.. గెలిపిస్తామన్న ధీమా పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. కానీ అలాంటి చోట ఒక యువ మహిళా నేత పార్టీకి తలనొప్పిగా మారారా... ఆమె తీరు పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోందా అంటే.. అవునని వినిపిస్తోంది.
టీడీపీలో క్రమశిక్షణ ఎక్కువే, కానీ!
ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ పార్టీ అయినా సరే.. ఒక విధానం.. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. దాని ప్రకారమే పార్టీలో నాయకులంతా నడవాలి. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కొంత ఎక్కువగానే ఉంటుంది. వీటికి భిన్నంగా శింగనమల నియోజకవర్గానికి చెందిన బండారు శ్రావణి వ్యవహరిస్తున్నారు. జిల్లాలో తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న యువ మహిళా నాయకురాలుగా శ్రావణి నిలిచారు. జనాకర్షణ ఉన్నా, ఆమె తీరుతో కేడర్ దూరమవుతోందని పార్టీలో వినిపిస్తోంది.
2014లో యామినిబాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల సమయానికి వ్యతిరేకత కారణంగా యామిని బాలని కాదని బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఒక్కసారిగా శ్రావణి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వచ్చి రాగానే జనంలోకి బాగా వెళ్లారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నియోజకవర్గంలో ఎవరు ఇంఛార్జిగా ఉన్నా, అభ్యర్థి ఎవరైనా.. పార్టీ రూల్స్ ప్రకారం నేతలు నడుచుకోవాలి. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని పోవాలి. ముఖ్యంగా సీనియర్ నాయకులు కొన్ని మండలాలను శాసించే వారిని కలుపుకోకుండా వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది శ్రావణికి చాలా కొద్ది కాలంలోనే తెలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమికి ఇవే కారణాలుగా నిలిచాయి. బండారు శ్రావణి ప్రజాధరణ ఉంది. నెగ్గాలంటే పార్టీ క్యాడర్ అంతా కలిసి పని చేస్తేనే విజయం. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వారు అవసరం చాలా ఉండాలి. ఆ ఎన్నికల్లో ఇవన్నీ మిస్ కావడంతో శ్రావణి ఓటమి చెందారు. సీనియర్లు, పార్టీ నాయకులతో అదే స్థాయిలో విభేదాలు కొనసాగాయి.
నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు, గార్లదిన్నెకు చెందిన మరో సీనియర్ నాయకుడు ముంటి మడుగు కేశవరెడ్డిలతో కలిసి టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. పార్టీ ఏ కార్యక్రమమైనా ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుందని ఆదేశించింది. టూమెన్ కమిటీ ఏర్పాటుతోనే ఇక్కడ ఇంఛార్జ్ లేరని తెలుస్తోంది. కానీ ఎక్కడా దీనిని అధికారికంగా చెప్పలేదు. దీంతో బండారు శ్రావణి ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. అయితే శ్రావణి వీరందరినీ కాదని తాను ఒంటరిగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ క్యాడర్‌లో చీలిక వచ్చినట్లు కనిపిస్తోంది. దాంతో నియోజకవర్గంలో చాలా మంది లీడర్లను ఆమె దూరం చేసుకున్నారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పట్టించుకోకుండా.. శ్రావణి ఒంటెద్దు పోకడలకు పోతుండటంతో పార్టీలో అసలు ఇంఛార్జ్ ఎవరో, తాము ఎవరి దారిలో నడవాలన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణం శ్రావణి వైఖరేనని పార్టీలో చాలామంది నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి అందర్నీ కలుపుకొని పోవాలని, నేతలు సహకరించకపోతే విజయాలు ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇటీవల జరిగిన చంద్రబాబు, లోకేష్ పర్యటనలో కూడా శ్రావణి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమె తండ్రిపై దాడి చేశారంటూ సొంత పార్టీ నేతల మీద పరోక్షంగా విమర్శలు చేశారు. ఎస్.ఎస్.బి.ఎన్ కళాశాల ఘటన నేపథ్యంలో లోకేష్ వచ్చిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, కొందరు పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇలా చాలా అంశాలు పార్టీ నేతలను ఆవేదనకు గురి చేసింది. అధిష్టానం ప్రస్తుతం టికెట్లు కేటాయించాల్సిన సమయం వచ్చింది. అధిష్టానం శింగనమలపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. టికెట్ రేసులో ముందు వరుసలో బండారు శ్రావణితో పాటు ఎంఎస్ రాజు, కంబగిరి రాముడు ఇంకా ఒకరిద్దరు నేతలున్నారు. బండారు శ్రావణికి జనాదరణ ఉన్నా, పార్టీ కేడర్‌ను కలుసుకుని వెళ్లకపోవడం ఆమెకు మైనస్ అవుతోంది. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో శ్రావణికి కొంతమేర అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ, సీనియర్లతో ఉన్న విభేదాలు ప్రశార్థకంగా మారాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ కేడర్ చాలా మంది శ్రావణి కి వ్యతిరేకంగా ఉన్నారని.. అధిష్టానం రంగంలోకి అంతా సెట్ చేస్తుందా.. లేక మరో వ్యక్తికి టికెట్ ఇస్తారా అనేది త్వరలోనే తేలనుంది. గత ఎన్నికల్లో బండారు శ్రావణిపై వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. ఈసారి జగన్ ఆమెకు టికెట్ ఇవ్వడం లేదు.