(Source: ECI/ABP News/ABP Majha)
Pawar Phone To KCR : కేసీఆర్‌కు శరద్ పవార్ ఫోన్ - యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని విజ్ఞప్తి
సీఎం కేసీఆర్‌కు శరద్ పవార్ ఫోన్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని కోరారు.
Pawar Phone To KCR : విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నిలబెట్టాలని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దీంతో ఆయనకు ఇతర పార్టీల మద్దతు సేకరించేందుకు సీనియర్ నేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ కూటమిలో కలవని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు పవార్ ఫోన్ చేసి మాట్లాడారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశామని మద్దతివ్వాలని కోరారు. శరద్ పవార్ అంటే కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతిచ్చారని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూంటారు. ఈ క్రమంలో శరద్ పవార్ విజ్ఞప్తిని కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు.
వెంకయ్య నాయుడు లేదా అనసూయ ఊకే ! ఈ ఇద్దరిలో ఒకరే రాష్ట్రపతి !
కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం పాటించాలని కేసీఆర్ ఓ విధానంగా పెట్టుకున్నారు. యశ్వంత్ సిన్హా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో బీజేపీ నేత అయినప్పటికీ .. ఆ పార్టీ మోదీ, షాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన దూరమయ్యారు. మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన తృణమూల్‌కు రాజీనామా చేశారు.
రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి
శరద్ పవార్ విజ్ఞప్తి మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ కూటమి అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం కాబట్టి ఆ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని విపక్ష పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా కేసీఆర్‌తో మాట్లాడే అవకాశం ఉంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరో వైపు రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ యశ్వంత్ సిన్హా అభ్యర్థి అయితే బీహార్‌కు చెందిన జేడీయూ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జేడీయూ ఎన్డీఏ పార్టీ. అయితే సిన్హా బీహార్‌కు చెందిన వ్యక్తి. బీహార్ వ్యక్తి రాష్ట్రపతి అయితే మద్దతిస్తామని జేడీయూ చెబుతూ ఉంటుంది. అదే జరిగితే బీజేపీ బలం కాస్త తగ్గుతుంది. ఓ రకంగా ఇవన్నీ బీజేపీకి సవాళ్లు లాంటివే అనుకోవచ్చు.