Arikepudi Gandhi: 'కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు' - కేసీఆర్ అంటే ఎప్పటికీ గౌరవమేనన్న అరికెపూడి గాంధీ
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే తాను అలా మాట్లాడినట్లు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. అక్రమ సంపాదన అంటూ చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు.
Arkepudi Gandhi Comments: కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని.. ఆయన తీరు మార్చుకోవాలని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) వ్యాఖ్యలపై ఆయన మరోసారి స్పందించారు. ఆయనకు పార్టీ ఏమైనా పదవి ఇచ్చిందా.?, తనతో మాట్లాడడానికి బీఆర్ఎస్‌లో ఎవరూ లేరా.? అని ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లు అంటూ విధ్వేషాలు రెచ్చగొట్టారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి భాషను కేసీఆర్, హరీష్ సమర్థిస్తే తాను కూడా సమర్థిస్తానని అన్నారు. తాను నోరు జారింది కూడా వాస్తవమేనని పేర్కొన్నారు. అక్రమ సంపాదన అంటూ కౌశిక్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్‌కు మచ్చ వస్తుందని.. అలాంటి వారి వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పారు.
కౌశిక్ రెడ్డి మహిళల్ని చులకనగా మాట్లాడడం కరెక్టేనా.? అని గాంధీ నిలదీశారు. అమెరికా నుంచి ఫోన్లో హెచ్చరికలు రావటంతోనే ఈరోజు కౌశిక్ తగ్గి మాట్లాడాడని అన్నారు. హరీష్ తన భాష గురించి మాట్లాడుతున్నారని.. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయన మాటలను గుర్తు చేసుకోవాలని అన్నారు. తన ఇంటిపై జెండా ఎగురవేయడానికి కౌశిక్ ఎవరని.. ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయడానికే ఆయన ప్రయత్నాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా గవర్నర్‌ను అవమానించిన చరిత్ర కౌశిక్‌దని.. చీర, గాజుల గురించి మాట్లాడి తల్లి, చెల్లి, భార్యను అవమానించాడని మండిపడ్డారు. కౌశిక్ రెచ్చగొట్టినందుకే తాను స్పందించాల్సి వచ్చిందని.. ఈటల రాజేందర్ రెండు పోటీ చేయడం వల్లే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో గెలిచాడని అన్నారు.
'కేసీఆర్ అంటే ఎప్పటికీ గౌరవమే'
కేసీఆర్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనని.. మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించారని గాంధీ అన్నారు. 'నీ ఇంటికి వస్తా.. కండువా వేసి తీసుకెళ్తా అంటే అర్థమేంటి.?. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా.?. మాపైనే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. మేము ఒక్కరిపై కూడా దాడి చేయలేదు. నీ ఇంటికి వస్తే ఏం చేశావు.?. రాళ్లు రువ్వి.. పువ్వుల కుండీలు విసిరావు. శేర్లింగంపల్లి ప్రజలకు నా గురించి పూర్తిగా తెలుసు. అందుకే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నోటికి అదుపులేని మనిషిని ఊరు మీదకు వదిలేశారు. కౌశిక్ రెడ్డి వల్ల కేసీఆర్ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుంది.' అని గాంధీ పేర్కొన్నారు.
కాగా, కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లి అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ రావు వంటి బీఆర్ఎస్ కీలక నేతల అరెస్టుతో అర్ధరాత్రి వరకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం శుక్రవారం కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం గాంధీ నివాసంలో సమావేశం ఉంటుందన్న సమాచారంతో కార్యకర్తలు భారీగా చేరుకోగా అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి, గాంధీ ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
Also Read: Harish Rao: అరెకపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి మాపై దాడులు చేయించారు - హరీశ్ రావు