Congress Tirupathi Sabha: మోదీ ఇచ్చిన మాట తప్పారు, అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: తిరుపతి సభలో సచిన్ పైలట్
AP Special Status: ఏపీకి ప్రత్యేక హాదా సాధనే లక్ష్యంగా తిరుపతిలో కాంగ్రెస్ న్యాయసాధన బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సచిన్ పైలట్ ప్రకటించారు.
AP Congress: ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల(Sharmila) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్ (Congress)లో కొత్త ఊపు వచ్చింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక తీసుకొచ్చిన షర్మిల... ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి(Tirupathi) నుంచి ఘనంగా ప్రారంభించారు. న్యాయసాధాన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా(Special Status) సాధించి తీరుతామని నేతలు స్పష్టం చేశారు
ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తాం
తిరుపతి(Tirupati) వెంకన్నస్వామి సన్నధిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. తారకరామ మైదానంలో కాంగ్రెస్(Congress) పార్టీ న్యాయసాధన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభలో పాల్గొన్న కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్(Sachin Pilot).. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని ఆయన గుర్తుచేశారు. నాడు ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని సభలో నాటకాలు ఆడిన బీజేపీ(BJP) నేతలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదముద్ర వేసి ఆర్థికశాఖకు పంపినా మోడీ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ ప్రమాణం చేశారని సచిన్ పైలట్ గుర్తుచేశారు. మోడీ(Narendra Modi) అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నా ఆయన ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, వైసీపీ(YCP) కూడా ఆ దిశగా మోడీపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే...ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేసి చూపుతామన్నారు.
సంపన్నులకే మోడీ అండ
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలు, బడుగు వర్గాలకు అండగా నిలిస్తే.... ప్రధాని మోడీ మాత్రం దేశంలోని సంపన్నులకే కొమ్ముకాస్తున్నారని సచిన్ పైలట్ మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులను బీజేపీ పూర్తిగా విస్మరించిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద సాగిలపడిందన్న సచిన్ పైలట్ ...కనీసం నిధులు అడుక్కోలేని దీనస్థితికి జగన్ దిగజారిపోయారన్నారు. ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడ తన మాటలతో మాయచేస్తున్నారు తప్ప... ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదని మాట ఇచ్చిందంటే కట్టుబడి తీరుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ కు, షర్మిలకు కావాలన్నారు. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయని... త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు.