Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Telangana Overseas Congress Meeting: తెలంగాణలో ఎమ్మెల్యేల అసంతృప్తి బయటపడుతున్న వేళ రేవంత్ పది రోజుల టూర్‌కు విదేశాలకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే వెంటనే ఆయన తిరిగి వచ్చేస్తున్నారు.

Revanth Reddy Foreign Tour Political Controversies: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ పేరుతో తలపెట్టిన విదేశీ పర్యటనలో ఊహించని రాజకీయ రచ్చ మొదలైంది. లండన్ లో ఉన్నత విద్యారంగ సంస్థల ప్రతినిధులతో చర్చలు ముగించుకుని, అక్కడి నుంచి నేరుగా అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్ నగరాలకు వెళ్లి ఎంఐటీ, హార్వర్డ్ వంటి గ్లోబల్ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన సీఎం పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శా రద్దు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది. లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్రం, యూఎస్ షెడ్యూల్‌కు రాజకీయ కోణంలో ఆమోదం నిరాకరిస్తున్నాం అని మొహమాటం లేకుండా ్రకటించింది.
ఎన్నారై కాంగ్రెస్ సమ్మిట్ ను అధికారిక ప్రోగ్రాంలో చేర్చిన అధికారులు
విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతించే ముందు ఆయా ఈవెంట్లు వారు నిర్వహిస్తున్న రాజ్యాంగబద్ధ పదవికి, పర్యటన ప్రధాన ఉద్దేశానికి తగినట్లుగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. రేవంత్ రెడ్డి అమెరికా షెడ్యూల్‌లో ఓవర్సీస్ కాంగ్రెస్ వేదికలపై ప్రసంగించడం, పార్టీ పరమైన పొలిటికల్ మీటింగులు ఉండటమే కేంద్రం అనుమతి నిరాకరించడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో లేదా అధికారిక పర్యటనల పేరుతో వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధమని కేంద్రం భావించి ఉండవచ్చనే వాదన ఉంది. ప్రతిపాదించిన కార్యక్రమం సీఎంగా ఆయన పదవి హోదాకు తగినట్లు లేదు అని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది.
కేంద్రం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
అయితే ఈ అంశంపై భిన్నమైన రాజకీయ కోణాలు విశ్లేషణకు వస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇది విపక్ష రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్న కక్షసాధింపు చర్య అని, తెలంగాణకు పెట్టుబడులు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. గతంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం ఇలాగే పొలిటికల్ క్లియరెన్స్ తిరస్కరించిన ఉదంతాలను వారు గుర్తు చేస్తున్నారు. సీఎం పర్యటన రద్దయినా, అధికారుల బృందం మాత్రం యూఎస్ వెళ్లి ప్లాన్ చేసిన ఒప్పందాలను పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించారు.
రాజకీయ కారణాలతోనే వెనక్కి వస్తున్నారా?
లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త ప్రచారం కూడా ఊపందుకుంది. ఇటీవల పార్టీలో ఎమ్మెల్యేల వివాదం, మంత్రి కొండా సురేఖ వర్సెస్ టీపీసీసీ మధ్య నడుస్తున్న షోకాజ్ నోటీసుల రచ్చ, ఇతర అసమ్మతి వర్గాల పోరుతో తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు చేయిదాటుతున్న తరుణంలో.. సీఎం వెంటనే హైదరాబాద్‌కు తిరిగి రావడం వెనుక అంతర్గత రాజకీయ అవసరం కూడా ఉందనేది మరొక వాదన. పర్యటనను నిలిపివేయడానికి కేంద్రం ఆంక్షలు అనే అంశం ఒక బలమైన రాజకీయ అస్త్రంగా, సానుభూతి సాధనగా కాంగ్రెస్‌కు పనికొస్తుందని అంటున్నారు. ఎన్నారై కాంగ్రెస్ ఈవెంట్‌ను పక్కనబెట్టి, కేవలం అధికారిక విద్యారంగ ఒప్పందాలకే పర్యటనను పరిమితం చేసి ఉంటే విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉండేవి. కానీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ గ్లోబల్ నెట్‌వర్క్ వ్యూహాల్లో భాగంగా అమెరికాలో ఓవర్సీస్ కాంగ్రెస్ సభలను సీఎం రేవంత్ షెడ్యూల్‌లో చేర్చడమే కేంద్రం నుంచి సాంకేతిక, రాజకీయ అభ్యంతరాలకు కారణమైందని భావిస్తున్నారు.
ఈ పర్యటన రద్దు పరిణామం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ పోరును మరింత రగిల్చింది. రేవంత్ రెడ్డి స్వదేశానికి తిరిగి రాగానే తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది అనే అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అదే సమయంలో, విదేశీ పర్యటనల నియమావళిని, పార్టీ కార్యక్రమాలతో ముడిపెట్టడం వల్ల వచ్చిన విమర్శలను సమర్థించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ సెంట్రల్ క్లియరెన్స్ వ్యవహారం రాబోయే రోజుల్లో మరిన్ని ఘర్షణలకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















