AP MLC Elections : ఎవరి ఓట్లు వారికే పడితే టీడీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు - రెబల్సే కీలకం ! ఏం జరగబోతోంది ?
ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్స్ కీలకంటీడీపీ రెబల్స్ వైసీపీకి ఓటేస్తారా? గైర్హాజర్ అవుతారా ?వైసీపీ రెబల్స్ ఏం చేస్తారు ?
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నేరుగా పార్టీని ధిక్కరించారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తానని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో తమతో కొంత మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రకటించారు. టీడీపీ తరపున అనూరాధ నామినేషన్ వేశారు. అందుకే ఇప్పుడు ఎన్నిక ఉత్కంఠగా మారింది.
13వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు !
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమకు ఓటేస్తారనే నమ్మకంతోనే అనురాధను రంగంలోకి టీడీపీ దించినట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి ఓటు వేయాల్సిందేనని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలు అప్రమత్తమయ్యారు.
ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 25 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి !
అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 25 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోయినా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి గెలుపు లభిస్తుంది. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఏడుగురు అభ్యర్థులకు ఓట్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికి 21 ఓట్లు లభిస్తాయి. మరో నలుగురు అభ్యర్థులకు మరో ఓటు అదనంగా వేయించవచ్చు. అంటే నలుగురికి 22 ఓట్లు, ముగ్గురుకు ఇరవై ఒక్క ఓట్లు పంచుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల కన్నా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు లెక్క. కానీ ఆ పార్టీకి ఉన్న సమస్య నలుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించడం.
ధిక్కరించిన ఓట్లు ఎవరి వైపు !
టీడీపీ, జనసేన రెబల్స్ ఓట్లు కీలకం అయ్యాయి. టీడీపీ తరపున గెలిచిన మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ వైసీపీకి అనధికారికంగా మద్దతు పలికారు. అలాగే జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే మద్దతుగా నిలిచారు. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేస్తాయి. వీరు పార్టీ విప్ ను ఉల్లంఘిస్తే అనర్హతా వేటు వేయమని పార్టీలు ఫిర్యాదు చేస్తాయి. అదే జరిగితే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా తమది నైతిక రాజకీయాలని.. వైసీపీ ప్రకటిస్తూ ఉంటుంది. అందుకే వారికి ఇంకా అధికారికంగా పార్టీ జెండా కప్పలేదు. ఇప్పుడు వారితో ఓటు వేయించుకోవాల్సి ఉంటుంది. ఓటు వేస్తే వారిపై అనర్హతా వేటు వేయాల్సి వస్తుంది. వీరు గైర్హజర్ అవడానికి కూడా అవకాశం ఉంది. అదే జరిగితే.. టీడీపీకి నాలుగు ఓట్లు తగ్గిపోతాయి. 19 మంది ఎమ్మెల్యేల ఓట్లే ఉంటాయి. అప్పుడు వైసీపీకి అన్ని ఎమ్మెల్సీ సీట్లు లభిస్తాయి.
వైసీపీని టెన్షన్ పెడుతున్న రెబల్ ఎమ్మెల్యేలు !
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కీలకం. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరూ పార్టీని ధిక్కరించారు. వారి ఓట్లు ఎవరికి వేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేస్తే... వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరికి చెరో ఓటు తగ్గుతుంది. టీడీపీ అభ్యర్థికి రెండు ఓట్లు పెరుగుతాయి. అప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనూరాధ విజయం సాధిస్తారు. వీరు కాకుండా మరో ఒకరిద్దరు సైలెంట్‌గా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినా.. వైఎస్ఆర్‌సీపీకి షాక్ తగులుతుంది. సరే ఇప్పటి వరకూ చెప్పిన రాజకీయ నీతి వాక్యాలన్నీ పక్కన పెట్టి.. టీడీపీ, జనసేన రెబల్స్ ఐదుగురితో తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటే.. వైఎస్ఆర్‌సీపీ సేఫ్‌గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్ !
ఈ ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం ఏడు స్థానాలు గెలిచి తీరాల్సిందేనని కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు తప్పవని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినా.. ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వైసీపీ టెన్షన్ పడుతుంది.