YSRCP MPs: వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా
Andhra Politics: వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం ఎమ్మెల్సీ సునీత ఆ పార్టీకి రాజీనామా చేయగా.. గురువారం రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
Ysrcp MPs Mopidevi And Beeda Masthan Rao Resigned: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda MasthanRao) ఏకకాలంలో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సమర్పించారు. వీరిద్దరూ బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను అందించారు. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఇదే దారిలో మరికొందరు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీలో, మరికొందరు బీజేపీలో చేరతారని సమాచారం. రాజ్యసభలో ఏపీకి మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా జరిగిన ఎన్నికల్లో అన్నీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. సంఖ్యాబలం పరంగా ఎగువ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయ తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బుధవారం ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
'అందుకే రాజీనామా'
తన రాజీనామా సందర్భంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం తనకు కొత్తేమీ కాదని.. గతంలో ఎన్నో పదవుల్లో పని చేసినట్లు తెలిపారు. 'గతేడాదిగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నా. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరమైన తీర్పు ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు. లోపం ఎక్కడ ఉందనేది వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాలి. నేను నిత్యం ప్రజల్లోనే ఉండాలని కోరుకునే వ్యక్తిని. నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు. పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం ఇప్పటిది కాదు. ఓ పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు. అందుకే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నా. గత ఎన్నికల్లో నాకు టికెట్ నిరాకరించారు. అయితే, అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. పార్టీని వీడొద్దంటూ కొందరు వైసీపీ పెద్దలు నాతో మాట్లాడారు. నా సమస్యలు వారికి చెప్పాను. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా. సీఎం చంద్రబాబు అనుభవం ఉన్న నేత. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారు. ఆయన సారథ్యంలో పని చేయాలని భావిస్తున్నా. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నా. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నా.' అంటూ మోపిదేవి పేర్కొన్నారు.
కాగా, గత కొంతకాలంగా మోపిదేవి వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రేపల్లె నుంచి టికెట్ ఆశించారు. తనకు కానీ లేదంటూ తన కుమారునికి జగన్ అసెంబ్లీ టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే, సామాజిక సమీకరణ పేరుతో జగన్ మోపిదేవి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వలేదు. మోపిదేవికి బదులుగా గణేశ్‌ను రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అప్పట్నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.