(Source: ECI/ABP News/ABP Majha)
Khammam Ponguleti : బీజేపీవైపు పొంగులేటి మొగ్గు - తుమ్మల ఎటు వైపు ? మారిపోతున్న ఖమ్మం రాజకీయాలు !
ఖమ్మం జిల్లా రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పార్టీ మారొచ్చని చెబుతున్నారు.
Khammam Ponguleti : ఇవాళ పొంగులేటి రేపు తుమ్మలే అన్న మాటలు ఖమ్మంజిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ బీఆర్ ఎస్ నేతలను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కారు దిగి కాషాయం కప్పుకుంటారా లేదంటే గులాబీలోనే ఉంటారా ?
కాషాయం గూటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!?
గత కొంత కాలంగా ఖమ్మం జిల్లా బీఆర్ ఎస్ ఇంటి పోరు వార్తల్లో నడుస్తూనే ఉంది. అయితే అప్పటికప్పుడు పరిష్కారాలే తప్పించి శాశ్వతంగా సమస్యని వదిలించుకునే ప్రయత్నం బీఆర్ ఎస్ అధినేత చేయలేదు. ఫలితంగా ఎన్నికల సమయం ముంచుకొస్తోన్న వేళ ఊహించని పరిణామాలు జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని తగ్గించడంతో రాజకీయంగా ఏదో మార్పులు జరుగుతున్నాయన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఊహించిందే అయినా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు సెక్యూరిటీ కుదింపుపై పొంగులేటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో ఏ క్షణమైనా పిడుగులాంటి వార్త వినపడవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానంటున్న పొంగులేటి !
గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ పొంగులేటికి ఇప్పటివరకు పార్టీలో సరైన గుర్తింపు లేదన్న ఆవేదన ఉంది. కెసిఆర్ తో ఉన్న రిలేషన్ తో ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించిన పొంగులేటి ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే రానున్న ఎన్నికల్లో తాను.. తన అనుచరులంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఓ వైపు సిట్టింగ్ లకే సీట్లని ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. అలాంటిది పొంగులేటి ఆయన అనుచరులు ఎలా ఎన్నికల బరిలో ఉంటారన్నది పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. బీజేపీ కూడా ఖమ్మం జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పలుమార్లు బీఆర్ ఎస్ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కూడా చేసిందన్న వార్తలు వచ్చాయి. మొదట్లో కాషాయం ఆఫర్ ని కాదన్న పొంగులేటి ఇప్పుడు ఓకే చెప్పినట్లు ఇన్ సైడ్ న్యూస్.అందుకే న్యూఇయర్ సెలబ్రేషన్స్ రోజున ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ కామెంట్లు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
తుమ్మల ఏ గట్టున ఉంటారు?
పొంగులేటితో పాటు త్వరలోనే తుమ్మల కూడా పార్టీ మారే ఛాన్స్ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. పాలేరు టిక్కెట్ ఆశిస్తోన్న తుమ్మలకి ఈసారి కూడా రాకపోవచ్చన్న టాక్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో తుమ్ముల వర్గీయులు ఆందోళనలో ఉన్నారట. అభిమానుల ఆశలకు విరుద్ధంగా ఉండలేని తుమ్మల కూడా కెసిఆర్ ని కలిసి ఓ నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. మంత్రి పువ్వాడతో పొంగులేటి, తుమ్మలకి సఖ్యత లేదు. జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, పార్టీ కార్యక్రమాలు చేపట్టినా వీరిద్దరికీ ఆహ్వానం ఉండదన్న టాక్ ఉంది. అందుకే వీరు గత కొంతకాలంగా బీఆర్ ఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట.
గోదావరి వరదల సమయంలో బాధితుల పరామర్శకి వచ్చిన కెసిఆర్ జిల్లా రాజకీయాలపై తుమ్మలతో మాట్లాడినా అక్కడి వరకే పరిమితమయ్యాయి కానీ ఆచరణలో కార్యరూపం దాల్చలేదట. పార్టీ మారమని ఇప్పటికే ఆ నేతలు స్పష్టం చేసినా కానీ కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడితో కాషాయం గూటికి పోవడం ఖాయమన్న వార్తలు వైరల్ గా మారాయి.