NTR centenary celebrations : పార్టీ పెట్టిన తర్వాత ప్రజలే కుటుంబం అనుకున్న ఎన్టీఆర్ - ఇంట్లో శుభకార్యాలకూ వెళ్లింది తక్కువే !
పార్టీ పెట్టిన తర్వాత ఇంట్లో శుభకార్యాలకన్నా ప్రజా కార్యక్రమాలకే ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చేవారు.
NTR centenary celebrations : ప్రజల కోసం ప్రాణాలు ఇస్తాం. ప్రజాసేవ కోసం దేనికైనా సిద్దమంటూ రాజకీయ నేతలు చెప్పే మాటలకు.. వారి చేతలకు ఎక్కడా పోలిక ఉండదు. ప్రజాసేవ చేయాలన్నదే కమిట్ మెంట్ అయితే.. ప్రజలు తప్పించి మరింకేమీ పట్టకూడదు. కానీ.. అలాంటి నేతలు భూతద్దంలో వేసినా దొరకరు. ఒకవేళ దొరికినా.. ఇంటికి.. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుంది. కానీ.. ఎన్టీఆర్ అలా కాదు. ఆయన రూటు సపరేటు. అందుకే ఆయన కోట్లాది మందికి ఆరాధ్యనీయులు అయ్యారు.ప్రజాసేవ విషయంలో ఆయనకున్న కమిట్ మెంట్ అంతా ఇంతా కాదు. దీనికి నిదర్శనంగా ఆయనకు సంబంధించిన ఒక విషయాన్ని చెబుతారు. సమకాలీన రాజకీయాల్లో అలాంటి పని చేసే దమ్మున్న నేత ఒక్కరు కూడా కనిపించరు.
బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకూ వెళ్లలే..!
1982 డిసెంబరు 8న ఎన్టీఆర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. బాలకృష్ణ వసుంధరను, రామకృష్ణ జయశ్రీని తిరుమలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సంబంధాల విషయంలో అన్నీ మాట్లాడిన ఎన్టీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నందున వారి వివాహాలకు మాత్రం వెళ్లలేకపోయారు. వధూవరులను ఫోన్‌లోనే ఆశీర్వదించారు. ప్రజాసేవ పట్ల ఎన్టీఆర్ కు ఉన్న కమిట్ మెంట్ అలాంటిది. అదే ఆయన్ను కోట్లాది మందిని అభిమానపాత్రుడ్ని చేసింది. ఆయన స్థానాన్ని ఇప్పటికి ఎప్పటికి మరొకరు భర్తీ చేయలేరు. తెలుగు జాతి ఒక్కటే.. ఎన్టీఆర్ ఒక్కరే. తమ కుమారుల పెళ్లిళ్లకు సైతం హాజరు కాని భర్త ఎన్టీఆర్ తీరుతో ఆయన భార్య బసవతారకం కన్నీరు పెట్టుకున్నారు.ఆయన్ను చూడాలనుకొని వెంటనే బయలుదేరారు. అప్పట్లో ఆయన నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ జిల్లాలో ఆయన పర్యటించే ఒక ప్రాంతంలో ఆయన రాక కోసం వెయిట్ చేశారు.
ప్రజల్నే బిడ్డగా భావించిన ఎన్టీఆర్
అయితే.. అపూర్వ ప్రజాదరణ కారణంగా ఆయన చాలా గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆయన్ను చూసినంతనే వేలాది మంది ఆయన మీద చూపించిన ఆదరణ..ఆయన్ను చూసినంతనే వెల్లువెత్తిన సంతోషం ఒకవైపు.. అదే పనిగా తిరిగిన కారణంగా నల్లగా మారిపోయిన ఎన్టీఆర్ ముఖం చేసిన వెంటనే దు:ఖంతో బసవతారకంకన్నీరు పెట్టేసుకున్నారు. ఈ రాజకీయాలు వద్దు.. మీరు.. పిల్లలే చాలు అని ఆంటూ భోరున విలపించారు. ఎన్టీఆర్ ఆమెను ఓదార్చి.. చుట్టూ ఉన్న జనాన్ని చూపిస్తూ.. "వీళ్లంతా ఎవరు తారకం? వీరు మాత్రం మనవాళ్లు కారా?' అన్న మాటలతో ఆమె ఊరట చెందారు. ప్రజల్ని ఓటు బ్యాంకు మాదిరి చూసే నేటి నాయకులకు.. ఇలాంటి మహానేతకు కలలో కూడా పోలిక పెట్టలేమని రాజకీయవర్గాలు చెబుతూంటాయి.
అభ్యర్థులకు పార్టీ ఫండ్‌గా రూ. ఐదు వేలిచ్చిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ మహా మొండిఘటం. చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తుండగా గుర్రంకొండలో ఏర్పాటు చేసిన స్టేజీపై చాలామంది ఎక్కారు. వేదిక కూలిపోవడంతో ఎన్టీఆర్ కాలికి గాయమైంది. రక్తం కారిపోతున్నా.. పట్టించుకోకుండా చైతన్య రథంపైకి ఎక్కి ఉపన్యసించారు. ఆ తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో ఆయనకు రెండుసార్లు దెబ్బలు తగిలాయి. తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నిధుల్లేవు. ఎంపిక చేసిన అభ్యర్థులను హైదరాబాద్ రావాలని పిలిచినప్పుడు భారీగా నగదు ఇస్తారనుకుని చాలామంది అభ్యర్థులు ట్యాక్సీలు కట్టించుకుని పెద్ద సూట్‌కేసులతో వచ్చారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత మరో రూ.5వేలు ఇచ్చారు. మిగతా అభ్యర్థులకు అది కూడా లేదు. అభ్యర్థులకు తెలుగుదేశం పాటలు, ఎన్టీఆర్ ప్రసంగాల క్యాసెట్లు, పోస్టర్లు, కరపత్రాలు ఇచ్చి పంపించారు. డబ్బులు ఇవ్వకపోయినా ఎన్టీఆర్ హవాతో టీడీపీ 200 సీట్లను గెలుచుకుంది.