![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
ఏ ప్రాతిపదికిన సీఎం జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారు ? సొంత నేతల ఆశలపై నీళ్లు చల్లి రెండు స్థానాలను తెలంగాణకు ఎందుకు కేటాయించారు ?
![YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ? Not eligible in YSRCP? What was the merit that Jagan saw in the selection of Rajya Sabha candidates? YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/63870207e7d7882398b6843f409d14dc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజ్యసభ సభ్యులను ఎంపిక వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఎలాంటి రాజకీయ సమీకరణాలు అనుసరిస్తున్నారో రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. గతంలో రిలయన్స్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తి , గుజరాత్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి చాన్సిచ్చారు. ఇప్పుడు కూడా ఇద్దరు తెలంగాణ వారికి అవకాశం కల్పించారు. మరో రెండు స్థానాలు నెల్లూరు జిల్లాకు కేటాయించారు. ఏపీలో ఎంతో మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు .. పార్టీ కోసం సుదీర్ఘంగా కష్టపడిన నేతలు .. హామీ పొందిన నేతలు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరికీ కాకుండా ఇతర రాష్ట్రాల వారికి సీఎం జగన్ చాన్సివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.
గతంలో గుజరాత్‌కు ఒకటి.. ఇప్పుడు తెలంగాణకు రెండు !
వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడిగా గతంలో గుజరాత్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి చాన్సిచ్చారు. ఆయన రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్. పరిమళ్ నత్వాని రెండు విడతలుగా రాజ్యసభకు జార్ఖండ్ తరపున ప్రాతినిధ్యం వహించారు. మూడో సారి జగన్ ఏపీ నుంచి అవకాశం కల్పించారు. జార్కండ్ నుంచి ఎంపీగా పన్నెండేళ్లు ఉన్నా... ఆయన జార్ఖండ్ గురించి రాజ్యసభలో మాట్లాడింది కూడా చాలా తక్కువేనన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఏపీ గురించి ఆయన మాట్లాడింది కూడా లేదు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు, లాయర్ నిరంజన్ రెడ్డికి జగన్ అవకాశాలు కల్పించారు. వారిద్దరూ ఏపీ సమస్యల గురించి.. కేంద్రం వద్ద ఎలా మాట్లాడతారో సులువుగానే అంచనా వేయవచ్చు.
నెల్లూరుకే మూడు రాజ్యసభ స్థానాలు !
ఏపీకి దక్కుతున్న రాజ్యసభ సీట్లలో కొన్ని ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్నారు. మరికొన్నింటిని నెల్లూరు జిల్లాకే కేటాయిస్తున్నారు. తాజాగా ఎంపిక చేసిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారని ఇంతకు ముందే చెప్పుకున్నాం. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు నెల్లూరుకు చెందిన వారు. మరో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు వాసే. అంటే ముగ్గురు నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న మరో ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి గుంటూరు జిల్లాకు... పిల్లి సుభాష్ .. తూ.గో జిల్లాకు చెందినవారు.
వైఎస్ఆర్‌సీపీలో సమర్థ వంతులైన నేతలు లేరా ?
టీడీపీ నేపధ్యం ఉన్న ఇద్దరికి రాజ్యసభ సీట్లు దక్కాయి. ఆర్ కృష్ణయ్య తెలంగాణలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు... రాజ్యసభ సీటు ఆఫర్ చేసి బీద మస్తాన్ రావును టీడీపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ చేసుకున్నారు. మరి వైఎస్ఆర్‌సీపీలో ఉన్ నసీనియర్ నేతల సంగతేమిటి ? . ఎమ్మెల్సీ, రాజ్యసభ చాన్స్ ఇస్తామనిచాలా మంది నేతల్ని వైఎస్ఆర్‌సీపీలో చేర్చుకున్నారు. వారంతా అవకాశాలు లేక అలా ఎదురు చూస్తున్నారు. వారిని కాదని.. ఇతరులకు జగన్ చాన్సిచ్చారు. దీంతో సహజంగానే ఆ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.
రాజ్యసభ పదవి రాజకీయ తాయిలమా ?
వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ నేతల్లో జగన్ అక్రమాస్తుల కేసుల లింకులు ఉండటాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డికి వరుసగా అవకాశాలు కల్పించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే అక్రమాస్తుల కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐ, ఈడీ కోర్టుల్లోనూ వాదిస్తున్న నిరంజన్ రెడ్డికి అవకాశం కల్పించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అక్రమాస్తుల కేసుల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనన్న ఆరోపణలు విపక్షాల వైపు నుంచి వస్తున్నాయి. మొత్తంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చూసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)