Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే
ఆనం సంగతి పక్కనపెట్టినా, మిగతా ఇద్దరూ పార్టీకి లాయలిస్ట్ లు. పార్టీ పెట్టినప్పటినుంచి జగన్ తోనే ఉన్నారు. ఇలాంటి నాయకుల్ని కోల్పోయిన జగన్,.. నెల్లూరులో పార్టీని ఎలా తిరిగి గాడిలో పెడతారో అని విశ్లేషకులు భావిస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ విప్ ధిక్కరించినట్టు తేలిపోయింది. ఆ నలుగురిలో ముగ్గురు నెల్లూరు ఎమ్మెల్యేలు, పైగా సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీని ధిక్కరించి నిలబడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందినవారే కావడంతో ఇక్కడ రాజకీయం మరింత రంజుగా మారుతోంది.
అప్పుడు పదికి పది
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే తిరుపతి, నెల్లూరు లోక్ సభ స్థానాలు కూడా వైసీపీకే దక్కాయి. మరో విశే్షం ఏంటంటే.. నెల్లూరు జిల్లానుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు.. ముగ్గురూ నెల్లూరు వాళ్లే కావడం విశేషం. ఇలా ఇంతమంది నేతల బలం ఉన్న నెల్లూరు జిల్లాలో జగన్ సొంత సామాజిక వర్గం మరింత బలంగా తయారైంది.
2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ గెలిచిన 10 స్థానాల్లో మూడు చోట్ల మినహా మిగతా ఏడుచోట్ల జగన్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ నాయకులంతా పార్టీకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ ఏడుగురిలో ముగ్గురు బయటకెళ్లిపోయారు. ఆ ముగ్గురూ అదే సామాజిక వర్గం నాయకులు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ ముగ్గురి బలం ఎంత..?
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సొంత బలం పెద్దగా లేదు అనే విషయం తెలిసిందే. స్థానికంగా ఆయనకు చాలామంది వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయన్ను దించేయాలని చూస్తున్నారు. ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేసిన వెంటనే స్థానిక నేతలు సంబరాలు చేసుకోవడం దీనికి నిదర్శనం. ఇక మిగిలిన ఇద్దరూ జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వగల సమర్థులు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకంటే పెద్దగా ఎదిగారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అక్కడ మంచి పలుకుబడి ఉంది. ఇప్పుడు టీడీపీ అభిమానులు కూడా తోడయితే అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తిరుగు ఉండదు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం కుటుంబం జిల్లాలో మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేయగలదు అనే ప్రచారం ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఆనంకు సొంత అనుచరులు, అభిమానులు ఉన్నారు. సో ఆయన కూడా వైసీపీకి జిల్లాలో చుక్కలు చూపించగలరని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు.
ప్రత్యామ్నాయం ఉందా..?
ప్రత్యామ్నాయ నాయకులను వెదకడం వైసీపీకి పెద్ద పనేం కాదు కానీ.. వారు ఆ ముగ్గురిని సమర్థంగా ఢీకొనగలరా అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. 2019లో జగన్ వేవ్ లో ప్రయోగాలన్నీ ఫలించాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై కాస్తో కూస్తో ఉందనుకుంటున్న వ్యతిరేకతకు స్థానిక నాయకుల బలం కూడా మరో కారణం అవుతుంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురు తిరిగిన తర్వాత తమ బలమేంటో పార్టీకి చూపించాలనుకుంటున్నారు. రామనారాయణ రెడ్డి సంగతి పక్కనపెట్టినా, మిగతా ఇద్దరూ పార్టీకి లాయలిస్ట్ లు. పార్టీ పెట్టినప్పటినుంచి జగన్ తోనే ఉన్నారు. మేకపాటి కుటుంబం పార్టీ పెట్టక ముందునుంచీ జగన్ వెంటే నడిచింది. ఇలాంటి నాయకుల్ని కోల్పోయిన జగన్,.. నెల్లూరులో పార్టీని ఎలా తిరిగి గాడిలో పెడతారో చూడాలి.