Raghurama : జగన్ చేతులెత్తేస్తేనే రాజీనామా - అనర్హతా వేటు వేయించాలని రఘురామ సవాల్ !
రాజీనామా చేస్తానన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెనుకడుగు వేశారు. అనర్హతా వేటు వేయించలేనని జగన్ చెబితే రాజీనామా చేస్తానని ప్రకటించారు.

వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా విషయంలో కొత్త ప్రకటన చేశారు. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి " ఇక నా వల్ల కాదు.. నువ్వే రాజీనామా చెయ్యి" అంటేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హతా వేటు వేయించేందుకు ఈ నెల పదకొండో తేదీ వరకూ గడువు ఇచ్చానని రఘురామ తెలిపారు. కొద్ది రోజులుగా రఘురామ ఫిబ్రవరి 11 వరకూ వైఎస్‌ఆర్‌సీపీకి గడువు ఇచ్చానని తనపై అనర్హతా వేటు వేయించాలని లేకపోతే తానే రాజీనామా చేసి నర్సాపురంకు ఉపఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్తానన్నారు.
ఇటీవల రఘురామపై వైసీపీ ఇచ్చిన అనర్హతా పిటిషన్ ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీంతో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. అయితే ఆ ప్రక్రియ ఇంకా సమయంతో కూడుకున్నదని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రఘురామపై అనర్హతా వేటుపై నిర్ణయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలకు వెళ్తారని అనుకున్న రఘురామ కూడా వెనక్కి తగ్గారు. జగన్ తన వల్ల కాదని చెబితేనే రాజీనామా చేస్తానని అంటున్నారు. అంటే.. ఇక రఘురామకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని.. నర్సాపురం ఉపఎన్నిక రాదని అనుకోవచ్చని రాజకీయవర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు. ఆ పార్టీపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ ప్రభుత్వ పాలనా లోపాలను మాత్రం ప్రతీ రోజూ బయట పెట్టి విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని తనపై అనర్హతా వేటు పడే అవకాశం లేదని ఆయన వాదిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం ప్రకారం ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజా ప్రతినిధి మరో పార్టీలో చేరితే స్పీకర్ అనర్హతా వేటు వేయవచ్చు. కానీ రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు. తన కుటుంబసభ్యులను కూడా ఇతర పార్టీల్లో చేర్చి ఆ పార్టీకి అనధికారికంగా అనుబంధంగా కూడా వ్యవహరించడం లేదు.
అయితే రఘురామపై అనర్హతా వేటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. స్పీకర్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద రెండు అనర్హతా పిటిషన్లు ఉన్నాయి. ఒకటి బెంగాల్‌కు చెందిన శిశిర్ అధికారి అనే ఎంపీది. ఆయన తృణమూల్ నుంచి బీజేపీలో అధికారికంగా చేరారు. ఆయనపై తృణమూల్ అనర్హతా పిటిషన్ వేసింది.రఘురామ ఏ పార్టీలో చేరకపోయినా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అనర్హతా పిటిషన్ వేసింది. స్పీకర్ నిర్ణయం వస్తేనే నర్సాపురంకు ఉపఎన్నిక ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుంది.





















