YSRCP News: నర్సరావుపేట అభ్యర్థి నాగార్జున యాదవేనా ? లావు రాజీనామాతో లైన్ క్లియర్ అయిందా ?
Narsaraopet YSRCP Mp Candidate: లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో నేతకు నర్సరావుపేట సీటు కన్ఫామ్ అయిందా ? సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
YSRCP Parliament Candidates: నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Krishnadevarayalu) ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో యువనేతకు నర్సరావుపేట సీటు కన్ఫామ్ అయిందా ? నమ్మినబంటుగా ఉన్న ఆ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో యనమల సాయి నాగార్జున యాదవ్ (Yanamala Sai Nagarjuna yadav ) పోటీ చేస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాడు-నేడు తీరును పర్యవేక్షించడానికి... ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గతేడాది యనమల సాయి నాగార్జున యాదవ్ ను ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది.
సీఎం జగన్ కు నమ్మినబంటు నాగార్జున
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చాలా కీలకం. ఈ లోక్ సభ సీటులో ఎలాగైనా విజయం సాధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు సీటు నిరాకరించారు. ఆయనకు గుంటూరు ఇస్తామని చెప్పడంతో పార్టీని వీడారు. నర్సరావుపేట స్థానం నుంచి యనమల సాయి నాగార్జున యాదవ్ ను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల జనాభా ఎక్కువగా ఉంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఓసీలు పోటీ చేస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ...బీసీ సామాజిక వర్గానికి నాగార్జున యాదవ్ కు టికెట్ కన్ఫాం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే...వాటికి కౌంటర్ ఇవ్వడంలో నాగార్జున యాదవ్ ముందుంటారు. కొన్ని సమయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఎలా చెబితే అలా వింటారు. అందుకే నాగార్జున యాదవ్ ను నర్సరావుపేట నుంచి బరిలో దించాలని సీఎం భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతేడాది నాగార్జున యాదవ్ వివాహానికి వెళ్లి ఆశీర్వదించారు.
బీసీలకు ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో...
వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ.... మంచి వాగ్ధాటి ఉన్న నేతగా జగన్ దృష్టిలో పడ్డారు నాగార్జున యాదవ్. గుంటూరుకు చెందిన ఆయన...పీహెచ్‌డీ చేశారు. తల్లిదండ్రుల తరఫు బంధువులు నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. యాదవుల ఓట్లు కూడా భారీగా ఉండటంతోనే ఎంపీ స్థానానికి నాగార్జున యాదవ్ అయితే బాగుంటుందని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకున్న తర్వాతే...బీసీలకు సీటు కన్ఫాం చేసినట్లు తెలుస్తోంది. దీని తోడు బీసీలకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో నరసరావుపేట స్థానాన్ని అతనికి కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనిపై నాగార్జున యాదవ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రిపేర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.