Resigns For Three Capitals : మూడు రాజధానుల కోసం రాజీనామాల మాట - వైఎస్ఆర్‌సీపీది ముందస్తు వ్యూహమా ?
మూడు రాజధానుల కోసం అవసరం అయితే రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానులు ఎజెండాగా ముందస్తుకు వెళ్లే ఉద్దేశంతోనే ఈ ప్రకటనలు చేస్తున్నారా ?
Resigns For Three Capitals : " అవసరం అయితే విశాఖపట్నం రాజధాని కోసం రాజీనామా చేస్తాను" అని మంతి ధర్మాన ప్రసాదరావు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ పార్టీ నేతలు ఇలాంటి సవాళ్లు చేయడం కామనే. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అవసరం అయితే.. సమయం వచ్చినప్పుడు వంటి ఆప్షన్లను తమ చాలెంజ్‌లలో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ధర్మాన కూడా అదే పెట్టుకున్నారు. కానీ మంత్రి వ్యాఖ్యలను అంత తేలికగా తీసుకోలేమని.. ఈ చాలెంజ్ వెనుక నిగూఢమైన రాజకీయ వ్యూహం ఉందన్న సందేహాలు ఎక్కువ మందికి వస్తున్నాయి.
వ్యూహాత్మకంగానే ధర్మాన రాజీనామా వ్యాఖ్యలు!
మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన రాజీనామా వ్యాఖ్యలు ఆషామాషీగా చేశారని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ద్రబాబు కానీ.. టీడీపీ నేతలు ఎన్నో సార్లు మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం రిఫరెండం కోసం ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. కానీ ఎప్పుడూ వైసీపీ నేతలు పట్టించుకోలేదు. కౌంటర్‌గా టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలంతా రాజీనామా ప్రజాతీర్పు కోరాలని సవాల్ చేసేవాళ్లు. కానీ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో ఉండగా ఇప్పుడు అవసరమైతే రాజీనామాలు అనే ప్రకటనలు చేయడం వైసీపీలోనూ ఇదేదో తేడాగా ఉందే అన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోందని వారు కూడా సందేహిస్తున్నారు.
మూడు రాజధానుల రిఫరెండంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారా?
అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల ఉద్యమం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేశామని.. ఆ జేఏసీ నిర్ణయాల ప్రకారం ఉద్యమం చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరే సరికి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మూడు రాజధానుల సెంటిమెంట్ పెంచే అవకాశం ఉంది. అప్పుడు అదే అంశంపై ఎన్నికలకు వెళ్లిపోవాలని వైసీపీ హైకమాండ్ తాజాగా నిర్ణయించుకుందని అందుకే ఇప్పుడు రాజీనామాల ప్రకటనలు చేయిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మాజీ సీఎస్ , బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా అదే చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. కేంద్రం కొత్త అప్పులు ఇవ్వకపోతే జీతాలు ఇవ్వడం కూడా కష్టం కాబట్టి ... మూడు రాజధానుల సెంటిమెంట్ మీద ఎన్నిలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
సంక్షేమం కన్నా భావోద్వేగమే బెటరనుకుటున్నారా ?
అయితే ఏపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే గడప గడపకూ ఎమ్మెల్యేలను పంపి.. ప్రతీ కుటుంబానికి ఇన్నేసి లక్షల మేర సాయం చేశామని గుర్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సాయం అందలేదని చెబుతున్నారు. అయితే అభివృద్ధి లేకపోవడం ...పథకాల లబ్దిదారులు తక్కువగా ఉండటం వంటి సమస్యలతో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోందన్న భావనఉంది. అందుకే సంక్షేమ పథకాల లబ్దిదారులు అండగా ఉంటారు.. మిగిలిన మైనస్ పాయింట్లను.. భావోద్వేగంతో అందుకోవాలని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే... మూడు రాజధానుల అంశంగా రిఫరెండం కోసం ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.