(Source: Poll of Polls)
Mohanbabu BJP : బీజేపీ మనిషిని - తిరుపతి కోర్టు ముందు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు !
తాను బీజేపీ మనిషినని మంచు మోహన్ బాబు ప్రకటించుకున్నారు. తిరుపతిలో ఓ కేసులో కోర్టుకు హాజరైన ఆయన కోర్టు ఎదుటే ఈ వ్యాఖ్యలు చేశారు.
Mohanbabu BJP : ప్రముఖ సినీ నటుడు, వైఎస్ఆర్‌సీపీ నేత మోహన్ బాబు తాను బీజేపీ మనిషినని నేరుగా ప్రకటించారు. తిరుపతి కోర్టుకు కుమారులతో కలిసి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సందర్భంగా లేకపోయినా తాను బీజేపీ మనిషినని ... బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునేవారిలో తాను ఒకరినని చెప్పుకొచ్చారు. అలా చెప్పుకోవడంలో మోహన్ బాబు ఉద్దేశం ఏమిటో కానీ మరి వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారా అన్న సందేహం రాజకీయవర్గాల్లో వస్తోంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేదని ఇద్దరు కుమారులతో పాటు విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఆయన రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రోడ్డుపై ధర్నా చేసిన మోహన్ బాబు
భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై పడుకుని ధర్నా చేశారు. అయితే అప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు ఆయనపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు పెట్టారు. ఈ కే్సుల విచారణ జరుగుతోంది. ఆ ధర్నా కార్యక్రమం అయిన తర్వాతి రోజు హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు మోహన్ బాబు. ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు.
వైఎస్ఆర్‌సీపీలో చేరినా ఇంకా రాజీనామా చేయని మోహన్ బాబు
ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. కానీ ఎప్పుడూ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించలేదు. కానీ మధ్యలో ఓ సారి కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. అప్పట్లో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది కానీ ఆయన చేరలేదు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని కొన్ని ఇంటర్యూల్లో చెప్పారు. ఇప్పుడు కోర్టు ఎదుట నేరుగా తాను బీజేపీ మనిషినని చెప్పుకోవడంతో రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కోర్టుకు హాజరవడం కూడా పాదయాత్రగా హాజరయ్యారు.
విద్యార్థుల కోసం పోరాడితే కేసులు పెట్టారని ఆరోపణ
కోర్టుకు పాదయాత్రగా వచ్చినప్పటికీ ఆ విషయాన్ని మోహన్ బాబు అంగీకరించలేదు. తాను రియల్ హీరోను అని.. తనకు చాలామంది అభిమానులు ఉన్నారని.. వారందరినీ ఆత్మీయంగా మాట్లాడేందుకే నడుచుకుని వచ్చానని చెప్పుకొచ్చారు. పాదయాత్రలతో వచ్చే పబ్లిసిటీ తనకు అవసరం లేదన్నారు. కేవలం విద్యార్థుల కోసం పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన ఉందని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో ఆయన త్వరలో బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది.