Target Revant : రేవంత్‌ను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ ఖల్లాస్ ! విపక్షాల టార్గెట్ ఇదేనా ?
కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్‌నే ఇతర పార్టీల నేతలు టార్గెట్ చేస్తున్నారు. రేవంత్‌ను నియంత్రిస్తే చాలు కాంగ్రెస్ పనైపోతుందని అనుకుంటున్నారా ?
Target Revant : కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ కారణంగా రేవంత్ రెడ్డినే చూపించారు. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అంతటితో ఆగలేదు. రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి బీజేపీలో చేరిన డీకే అరుణ లాంటి నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా రేవంత్ రెడ్డినే టార్గెట్ అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ సీన్‌లోకి వచ్చాక రేసులోకి వచ్చిన కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. అయితే మొదట్లో ఆయనకు పార్టీలో పెద్దగా చొరవ తీసుకునే అవకాశం కల్పించకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. అప్పట్లో పార్టీలో సమస్యలకు రేవంత్ రెడ్డి కారణం అని చెప్పే పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు ఆయన టీ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేసులో ఉంది అని చెప్పుకుంటున్నారటే అది రేవంత్ రెడ్డి దూకుడైన నాయకత్వం వల్లనే అని చాలా మంది అభిప్రాయం. అయితే ఆయన నాయకత్వపై ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. తాము దశాబ్దాలుగా ఉన్నామని ఇప్పుడు బయట నుంచి వచ్చి పెత్తం చేయడం ఏమిటన్నది వారి అభిప్రాయం. ఎప్పుడొచ్చాం కాదన్నది రేవంత్ రెడ్డి.. హైకమాండ్ ఆలోచన. అందుకే సీనియర్లు రేవంత్ రెడ్డితో కలవలేకపోగా.. ప్రత్యామ్నాయాలు చూసుకుటున్నారు.
రేవంత్‌ను టార్గెట్ చేసి బయటకు వెళ్లిపోతున్న నేతలు
బయటకు వెళ్తున్న నేతలు.. పార్టీలోనే ఉంటున్న జగ్గారెడ్డి , వీహెచ్ లాంటి నేతలు ఎప్పుడు చాన్స్ దొరికినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయం ప్రకారం.. తెలంగాణకు వచ్చిన యశ్వంత్ సిన్హాను కలవకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే రేవంత్ చేప్పేదేమిటని వీహెచ్ వెళ్లారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించి రేవంత్ పై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుంపట్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ సొంత పార్టీ నేతల అసలు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు.. రేవంత్ రెడ్డినే.
కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే రేవంత్‌ను కొడితే చాలా !?
రాజగోపాల్ రెడ్డితోనే రేవంత్ పై ఎటాక్ చేసే సీనియర్ల జాబితాలో ఆగిపోయే చాన్స్ లేదని తెలుస్తోంది. త్వరలో మరికొంత మంది రేవంత్ ను గురి పెట్టి రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అది సొంత పార్టీ నుంచే కాదు.. బీజేపీ నుంచి కూడా. ప్రత్యర్థిని బలం పుంజుకోనీయకుడా చేయడం కూడా.. మరో పార్టీ బలం పెరగడానికి కారణం అనుకోవచ్చు. బీజేపీ రేవంత్ ను టార్గెట్ చేయడం ద్వారా అలాంటి వ్యూహాన్ని తెలంగాణ పార్టీలు అమలు చేస్తున్నాయని అనుకోవచ్చు.