Desh Ki Neta : దేశ్ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !
మేక్ ఇండియా నెంబర్ వన్ పేరుతో దేశవ్యాప్త పర్యటనకు కేజ్రీవాల్ రెడీ అయ్యారు. మోదీకి ప్రత్యామ్నాయం తానేనని నిరూపించుకోవాలన్నది ఆయన లక్ష్యమని భావిస్తున్నారు.
Desh Ki Neta : దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధీటైన నేతను తామేనని నిరూపించుకునేందుకు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలుచేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు మోదీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన ముందడుగు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
"మేక్ ఇండియా నెంబర్ 1 " పర్యటనలు ప్రారంభించనున్న కేజ్రీవాల్ !
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మేక్ ఇండియా నెంబర్ 1 మిషన్‌ను ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలన్నీ తాను చేపట్టిన మిషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన మిషన్ ప్రధానంగా విద్య, వైద్య, సేద్య రంగాలపై దృష్టిసారిస్తుందని చెప్పారు. ఈ మిషన్ ద్వారా 130 కోట్ల భారతీయులను ఏకతాటిపైకి తీసుకువస్తానని తెలిపారు. మనం దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది చిన్నారులకు మెరుగైన, ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెరుగైన, ఉచిత వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చూడటం అత్యవసరమని స్పష్టం చేశారు. తనది రాజకీయాలకు అతీతమైన యాత్ర అని చెబుతున్నారు కానీ ఆయన దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తూ.. దేశ్ కీ నేత అయ్యేందుకు ప్రయత్నాలుచేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత దేశ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి !
తెలంగాణ సీఎం కేసీఆర్ .. దేశ్ కీ నేత రేసును ఎప్పుడో ప్రారంభించారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయనకు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. ఇటీవల ఆయన జాతీయ పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా పర్యటించాలనుకున్నారు. అందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ఏదీ కలసి రాకపోతూండటంతో వాయిదా వేసుకున్నారు. ముందుగా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడాన్ని సవాల్‌గా తీసుకుని .. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం తగ్గించారు. మూడో సారి గెలిస్తే తన పేరు దేశం మొత్తం మార్మోగిపోతుందని.. భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ దేశ్ కీ నేత పేరుతో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్తరాదిలో విస్తృతంగా ప్రచారం చేశాయి. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించినప్పుడు ఆ పేరుతోనే పోస్టర్లు వేశారు. ఇప్పుడు తెలంగాణలో గెలవడంపైనే దృష్టి పెట్టినందున.. జాతీయ రాజకీయాల విషయంలో కొంత వెనక్కితగ్గినట్లుగా భావిస్తున్నారు.
మమతా బెనర్జీ, నితీష్ కుమార్ కూడా రేసులోనే !
ఇక మోదీకి తామే ప్రత్యామ్నాయం అని భావించే వారిలో నితీష్ కుమార్, మమతా బెనర్జీ కూడా ఉంటారు. ఇటీవల బీజేపీని వదిలేసి నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది వచ్చే ఎన్నికల నాటికి అనుసరించాల్సిన వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. తనను తాను ప్రధాని అభ్యర్థిగా నితీష్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇక మమతా బెనర్జీ కూడా ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ప్రాంతీయ పార్టీల్ని లీడ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు కలిసి రాలేదు.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. దేశ్ కీ నేత రేసులో మరింత మంది నేతలు చేరే అవకాశం ఉంది. వివిధ పేర్లతో వారంతా దేశ పర్యటనలు ప్రారంభించనున్నారు.